ఎన్నికల ముందు అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్న విధానాలకు పొంతన ఉండడం లేదు. ఆనాడు అధికారం కోసం అడ్డగోలుగా హామీలు ఇచ్చి ఓట్లను కొల్లగొట్టి… ప్రస్తుతం అదే ఓటర్లకు మొండిచెయ్యి చూపుతున్నది. అందరికీ 2 లక్షల వరకు రుణమాఫీ అని ఆర్భాటంగా ప్రకటించిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తీరా అమలుకు వచ్చే సరికి సగానికి సగం కోత పెట్టింది. ఇప్పటికీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కనీసం రెండున్నర లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఐదు నెలలుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఎకరాకు రూ.15వేల పంట సాయం ఇచ్చే రైతు భరోసా పథకంపైనా నీలినీడలు కమ్ముకుంటున్నాయి. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా వారు ప్రకటించిన రైతు భరోసా అందలేదు. గత యాసంగిలో అమలు చేసినా, కేసీఆర్ సర్కార్ ఇచ్చిన రైతుబంధు పథకాన్నే ఎకరాకు రూ.5వేల చొప్పున ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. వానకాలం నుంచి ఎకరాకు ఒక్కో సీజన్‌కు రూ.7,500 ఇస్తామని చెప్పి అసలుకే ఎసరు పెట్టారు. ఇప్పుడు యాసంగి పంట కాలానికి సంక్రాంతి తర్వాత ఇస్తామని ప్రభుత్వం ప్రకటన చేసినా ఎంతమందికి ఇస్తారు, అందరికీ ఇస్తారా, లేదా అనే సందేహాలు సర్వత్రా నెలకొన్నాయి. గ్రామాల్లో ఏ ఇద్దరు రైతులు కలిసినా రైతు భరోసా ఇచ్చేనా? ఇస్తే ఎన్ని ఎకరాల వరకు ఇస్తారు? ఎవరికి కోత పెడుతారు? అన్న చర్చ నడుస్తున్నది.
– నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ)
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎకరానికి రూ.15వేల చొప్పున రైతు భరోసా ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెప్తే పెట్టుబడి సాయం పెరుగుతుందని రైతులు ఆశ పడ్డారు. కానీ ఇచ్చే మొత్తం పెంచుతూనే నిబంధనల పేరిట సగానికి సగం మంది రైతులకు రైతు భరోసా ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని రాజకీయ, రైతు సంఘాల నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల చివరి రోజున రైతు భరోసాపై స్వల్పకాలిక చర్చ పెట్టి తుది నిర్ణయం ప్రకటించకుండానే వదిలేశారు. ఈ చర్చలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ప్రస్తావించడంతో రైతు భరోసాలో లబ్ధిదారుల కోత తప్పదని భావిస్తున్నారు. ప్రభుత్వ తీరును పరిశీలిస్తే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఎవరికైతే వర్తిస్తుందో అదే రైతులకు రైతుభరోసాను అమలు చేస్తారన్నది ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ఇదే జరిగితే రైతు భరోసా లబ్ధిదారుల సంఖ్య సగానికి సగం తగ్గిపోతుంది.
వానకాలంలో సాగుచేసి యాసంగిలో సాగు చేయని భూములకు రైతు భరోసా ఇవ్వరన్న చర్చ ప్రభుత్వ వర్గాల నుంచి వినిపిస్తున్నది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఇటీవల అసెంబ్లీలో సభ్యులకు అందించిన వివరాల్లో యాసంగిలో పంటలు వేయని భూములను సాగులో లేని భూముల కింద చూపించినట్లు సమాచారం. ఇదే జరిగితే రైతు భరోసాకు మెట్ట భూముల రైతులంతా దూరం కానున్నారు. సాధారణంగా జిల్లాలో వరి, పండ్ల తోటలు మినహా మిగతా పంటలన్నీ వానాకాలంలోనే సాగు చేస్తారు. పత్తి, జొన్న, ఇతర మెట్ట పంటలను ఏడాదిలో ఒకేసారి సాగు చేస్తారు. సంక్రాంతి వరకు ఈ పంటల దిగుబడి పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పంట వేయని రైతులకు భరోసా లేదంటే ఇప్పటి వరకు రైతుబంధు పొందిన రైతుల్లో 70 శాతం మంది అనర్హులు కానున్నారు.
ఇదే జరిగితే ప్రభుత్వం ఇచ్చే రైతుభరోసా ఏ కొద్దిమంది రైతులకో అందతుంది. జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే… రుణమాఫీ మాదిరిగానే రైతు భరోసాకు సైతం ప్రభుత్వం కోతలు పెడుతుందన్న భయం రైతులను వెంటాడుతున్నది. భూమి ఉన్న ప్రతితీ రైతునూ సాగు వైపు మళ్లించాలని, తద్వారా బీడు భూములను సైతం సాగులోకి తేవాలని, పంటల దిగుబడిని ప్రోత్సహించాలని 24 గంటల ఉచిత కరెంటు, సాగునీటికి తోడు రైతుబంధు కూడా అందిస్తే వ్యవసాయం పండుగలా మారుతుందని అప్పటి కేసీఆర్ సర్కార్ నిరూపిస్తే… ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవేమీ పట్టకపోవడం గమనార్హం. కేవలం రుణమాఫీని, రైతుభరోసా వంటి పథకాలను ఆర్ధిక పరమైన అంశాలుగానే భావిస్తూ భారం తగ్గించుకునేందుకు మాత్రమే ఆలోచిస్తుండడం పట్ల రైతు సంఘాల నాయకులు, వ్యవసాయ రంగ నిపుణులు మండిపడుతున్నారు. ఎలాంటి షరతులూ లేకుండా గతంలో మాదిరిగానే ప్రతి రైతుకూ రైతుభరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
అందరికీ రుణమాఫీ అని ముందుగా ప్రకటించి తీరా అమలులోకి వచ్చే సరికి రేషన్ కార్డు, ప్రభుత్వ ఉద్యోగులు, రెండు లక్షలకు పైగా లోన్ ఉంటే అనర్హులు అనే నిబంధనలతో భారీగా కోతలు పెట్టారు. దాంతో ఉమ్మడి జిల్లాలో కనీసం రెండున్నర లక్షల మంది రైతులు రుణమాఫీకి దూరమయ్యారు. ఇప్పుడు ఇదే తరహాలో రకరకాల నిబంధనలతో రైతు భరోసాను కొందరికే పరిమితం చేసే చర్యలను కాంగ్రెస్ సర్కారు వేగవంతం చేస్తున్నది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నిబంధనలే రైతు భరోసాకు వర్తింపజేస్తే రాష్ట్రంలో దాదాపు గతంలో 70 లక్షల మందికి ఇచ్చిన రైతుబంధును ప్రస్తుతం 30 లక్షల మందికే భరోసా రూపంలో ఇస్తే సరిపోతుందని అంచనా. బీఆర్ఎస్ పాలనలో ప్రతి సీజన్‌కు కేసీఆర్ సర్కారు సుమారు 12 వేల కోట్ల వరకు రైతుబంధు ద్వారా ఇస్తే.. ఇప్పుడు రూ.7,500 కోట్లు సరిపోతాయని కాంగ్రెస్ సర్కారు అంచనా వేస్తున్నట్లు సమాచారం.
ఇందుకు ఇటీవల అసెంబ్లీలో రైతు భరోసాపై చర్చలో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలు సరిపోలుతున్నాయి. అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడు తూ… గుట్టలు, బండరాళ్లు, రోడ్లకు రైతుబంధు ఇచ్చారంటూ చేసిన వ్యాఖ్యలు కుదింపునకు సంకేతాలేనని రైతు సంఘం నాయకులు అభిప్రాయపడుతున్నారు. రైతు భరోసా పథకంలో కోతలను ముందే కవర్ చేసుకునేలా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ లెక్కన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కనీసం సగానికిపైగా లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోవచ్చని అంచనా వేస్తున్నారు. కేసీఆర్ సర్కారులో ఉమ్మడి జిల్లాలో సుమారు 11 లక్షల మంది రైతులకు ఒక్క సీజన్లో రూ.1,300 కోట్ల వరకు పెట్టుబడి సాయంగా రైతు బంధు డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేశారు.
నిజంగా ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారు ఎకరాకు రూ.7,500 చొప్పున రైతు భరోసా ఇవ్వాల్సి వస్తే ఉమ్మడి జిల్లాలో ఈ యాసంగి సీజన్లోనే కనీసం రూ.2వేల కోట్లు రైతులకు చెందాల్సి ఉంటుంది. కానీ అటూఇటుగా ఈ సీజన్లో రూ.700 నుంచి 800 కోట్ల వరకు ఇస్తే గగనమని ప్రభుత్వ చర్యలను బట్టి తెలుస్తున్నది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నిబంధనలను అమలు చేస్తే ఇంట్లో ఒక రైతుకు మాత్రమే రైతు భరోసా వర్తించనుంది. ఒక కుటుంబంలో ఇద్దరు ముగ్గురు రైతుల పేర్లపై భూమి ఉంటే అందులో ఒక్కరికే రైతుభరోసా ఇచ్చే అవకాశం ఉంది. రుణమాఫీ మాదిరిగానే కనీసం రెండేండ్లు ఐటీ కట్టిన వారికి రైతు భరోసా రాకపోవచ్చు. ఇక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు, ఆరిటెక్చర్లు, ఇతర ప్రొఫెషనల్ వ్యక్తులకు సైతం రైతు భరోసా వర్తించకపోవచ్చు.