శాలిగౌరారం: షా, అలీ, గౌరమ్మ అనే పేర్ల కలయికతోనే గ్రామానికి శాలిగౌరారంగా పేరుగా వాడుకలోకి వచ్చింది. 1908 ముందు చిన్న కుంటలా ఉన్న చెరువును ఆనాటి నిజాం నవాబులు పునరుద్ధరించారు. చెరువు కట్టను 3కిలోమీటర్ల మేర పొడగించి 780ఎకరాల్లో విస్తరించారు. అదే ఇప్పుడు శాలిగౌరారంతో పాటు మరో 10గ్రామాలకు ఆదెరువుగా మారింది.
ప్రాజెక్టును షా, అలీ అనే ఇద్దరు అన్నదమ్ములు నిర్మించినట్లు పూర్వికులు పేర్కొంటున్నారు. చెరువు కట్టకు మధ్యలో ఎలాంటి తూము ఏర్పాటు చేయకున్నా 5మోటర్ల నీళ్లు జాలు మాదిరిగా పారేదని దానినే గౌరమ్మ తూముగా పిలుచుకు నే వాళ్లని చెబుతున్నారు.
రామన్నపేట మండలం పల్లివాడ హెడ్‌వర్క్ నుంచి సుమారు 30కిలోమీటర్ల దూరంలో ఉన్న శాలిగౌరారం ప్రాజెక్టులోకి నీరు వచ్చేలా రాచకాల్వను ఏర్పాటు చేశారు.
ప్రాజెక్టుకు కుడి, ఎడమ కాల్వలను ఏర్పాటు చేసి 6వేల ఎకరాల్లో సాగు నీరందేలా ఆనాడే రూపకల్పన చేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి 21అడుగులుగా స్థిరీకరించారు. ప్రస్తుతం ఆయకట్టు మొత్తం పచ్చని పంటలతో కనువిందు చేస్తున్నది.