వానకాలంలో పండించిన పంటలను అమ్ముకునేందుకు గత నెల రోజులుగా ఉమ్మడి జిల్లాలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఎటు చూసినా ఓ వైపు ధాన్యం రాశులు, మరోవైపు పత్తి బోరాలు కనిపిస్తున్నాయి. కానీ వాటికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను పొందాలంటే సవాలక్ష కొర్రీలు ఎదురవుతున్నాయి. ఇటు మిల్లర్లు ధాన్యం రైతును, అటు సీసీఐ సెంటర్ల నిర్వాహకులు పత్తి రైతును దగా చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ఎలా ఎగనామం పెట్టడమే లక్ష్యమన్నట్లుగా వ్యవహరిస్తుండడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ఇలాంటి సమయాల్లో క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షిస్తూ అండగా నిలవాల్సింది ప్రభుత్వ పెద్దలే. గత కేసీఆర్ సర్కార్‌లో ప్రతి సీజన్లోనూ నాటి మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఇతర మంత్రులు జిల్లాల వారీగా స్థానిక ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగంతో సమీక్షించి కొనుగోళ్లు సజావుగా సాగేలా చర్యలు చేపట్టేవారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్‌లోని మంత్రులకు ఆ తీరిక దొరకడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కాంగ్రెస్ మీటింగ్‌లోనూ ఆ పార్టీ నేతలే కొనుగోళ్లపై వ్యక్తం చేసిన ఆవేదన వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. అయినా సరే జిల్లాలోని ఇద్దరూ మంత్రులతోపాటు జిల్లాకు ఇన్చార్జి మంత్రి కూడా ఉన్నా…నేటికి ఒక్కసారి కూడా పంటల కొనుగోళ్లపై సమీక్ష జరుపకపోవడం ఏంటని రైతులు మండిపడుతున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వ్యవహరిస్తున్నారు. ఇక నల్లగొండ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రిగా, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆర్అండ్బీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఇందులో ఇన్చార్జి మంత్రి తుమ్మలతోపాటు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శాఖలు కూడా నేరుగా రైతులు, పంటల ఉత్పత్తులతో సంబంధం ఉన్న శాఖలే. అయినా సరే వీరిలో ఎవ్వరికీ కూడా నేటికి ఉమ్మడి జిల్లా పరిధిలో ధాన్యంగానీ, పత్తి కొనుగోళ్లపైగానీ సమీక్షించే తీరిక దొరకడం లేదు. రాష్ట్రంలోనే ఉమ్మడి నల్లగొండ జిల్లా ధాన్యం, పత్తి పంటల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం ధాన్యం, పత్తి పంటలు మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. వడ్ల కొనుగోలు కోసం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా దొడ్డురకం వడ్ల కొనుగోళ్లు ఓ మాదిరిగా జరుగుతుండగా సన్నవడ్లు మాత్రం ప్రభుత్వ నిబంధనలతో కేంద్రాలకు రావడం లేదు. దీంతో సన్నవడ్లను పండించిన రైతులు నేరుగా రైస్‌మిల్లులకు ధాన్యాన్ని తరలిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో 6.81లక్షల ఎకరాల్లో సన్నాల సాగుకు అంచనా వేయగా 15.50లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రావచ్చని అంచనా వేశారు. ఇందులో ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి సన్నాలను రైతులు మిర్యాలగూడ ప్రాంతంలోని మిల్లులకే తీసుకువస్తున్నారు. ఇప్పటివరకు నాన్‌ఆయకట్టు సన్నాలు రాగా ఇక నుంచి సాగర్ ఆయకట్టులోని సన్నాలు మార్కెట్‌కు భారీ ఎత్తున రానున్నాయి. ఆరంభంలో రూ.2400 వరకు సన్నాలకు ధర చెల్లించిన రైస్‌మిల్లర్లు ధాన్యం భారీగా ముంచెత్తుతుండడంతో ఇదే అదునుగా ధరను తగ్గించి వేస్తున్నారు. రైస్‌మిల్లర్లు సిండికేట్‌గా మారి క్వింటాలు సన్నవడ్లకు రూ.2,150 నుంచి రూ.2,300 వరకే చెల్లిస్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత వానకాలంలో అత్యధికంగా రూ.2,800 నుంచి రూ.3,150 వరక కొనుగోలు చేసిన మిల్లర్లు ప్రస్తుతం ధరను భారీగా తగ్గించడంలో రైతులు రగిలిపోతున్నారు. దీంతో రైస్‌మిల్లర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్లెక్కుతున్నారు. రైతుల ఆందోళనతో అధికారులు స్పందించడంతో మిల్లర్లు కొద్ది సేపు దిగి వస్తున్నా.. తర్వాత యథావిధిగా ధరలో కోతలు పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారు.
పత్తి కొనుగోళ్లలోనూ కొర్రీలు
ఇక ఇదే సమయంలో పత్తి రైతులు సైతం నిలువు దోపిడీకి గురవుతున్నారు. జిల్లావ్యాప్తంగా 7 క్లస్టర్లలో 23 జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు జరుపుతున్నట్లు ప్రకటించినా ఆచరణలో పరిస్థితి వేరుగా ఉంది. కొన్ని మిల్లులకే సీసీఐ అనుమతించడంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక కొనుగోళ్లు జరుపుతున్న జిన్నింగ్ మిల్లుల్లో సైతం తేమ పేరుతో సీసీఐ అధికారులు పత్తి కొనుగోళ్లల్లో కొర్రీలు పెడుతున్నారు. 8 నుంచి 12శాతం తేమ ఉంటేనే మద్దతు ధర రూ.7521లు చెల్లిస్తామంటున్నారు. కానీ ఇటీవల తుఫాన్ వర్షాల కారణంగా పత్తి నాణ్యతతో పాటు తేమ శాతం కూడా ఎక్కువగా ఉంటుండడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో రైతులు విధిలేని పరిస్థితుల్లో గ్రామాల్లోని దళారులకు పత్తిని క్వింటాలుకు రూ.5,800 నుంచి రూ.6,300 వరకే విక్రయించాల్సి వస్తుంది. సీసీఐ తీరుతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సీసీఐ కేంద్రాల వద్ద నిత్యం పత్తి రైతుల ఆందోళనలు నిత్యకృత్యంగా మారాయి. రానున్న నెల రోజులు ధాన్యం, పత్తి పంటల దిగుబడి మరింత పెరగనుంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులకు అండగా నిలవాల్సి ఉంది. అధికారులు ఆడపాదడఫా స్పందిస్తూ వారికి ఉన్న పని ఒత్తిళ్లతో పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నారన్న చర్చ ఉంది.
మంత్రులు అంత బిజీనా..
జిల్లా మంత్రులతో పాటు జిల్లా ఇన్చార్జి మంత్రికి కూడా రైతుల బాధలు పట్టనంత బిజీ ఏముంటుందన్న చర్చ జిల్లాలో జోరుగా సాగుతున్నది. పంటలు అమ్ముకునే సమయాల్లో రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వ పెద్దలుగా మంత్రులకు ఎందుకు పట్టడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మద్దతు ధర రాక, కొనుగోళ్లు సజావుగా సాగక నిత్యం రైతులు రోడ్లెక్కుతున్న వార్తలు మీడియాలో వైరల్‌గా మారినా మంత్రులు స్పందించకపోవడం ఏంటని రైతులు మండిపడుతున్నారు. మరోవైపు నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశంలోనే ఆ పార్టీ నేతలు ధాన్యం రైతుల బాధలు వర్ణనాతీతం అంటూ… గత ప్రభుత్వంలో వారం రోజుల్లోనే ధాన్యం డబ్బులు పడేవని… జిల్లాకు చెందిన మంత్రే సివిల్ సప్లయ్ మంత్రిగా ఉన్నా నెల రోజులుగా పంటలు అమ్ముకోవడానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయినా జిల్లా మంత్రుల్లో చలనం లేకపాయే అని ఆ పార్టీ శ్రేణులే ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే వానకాలం పంటలకు రైతుభరోసాకు ఎగనామం పెట్టారు… రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయలేదు… పండించిన ధాన్యం మొత్తానికి రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడేమో సన్నవడ్లకే అని మెలిక పెట్టారు. ప్రభుత్వ తో.డ్పాటు కరువైనా సరే.. పండించిన పంటల కొనుగోళ్లు సజావుగా జరిగేలా, వాటికి మద్దతు ధర లభించేలా చూడాల్సిన బాధ్యత జిల్లా మంత్రులు, జిల్లా ఇన్చార్జి మంత్రికి లేదా అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.