కోదాడ, మే 30 : కోదాడ-కట్టకమ్ములగూడెం గ్రామాల మధ్య కోదాడ శివారులో బైపాస్ రోడ్డుపై ప్లై ఓవర్ నిర్మించాలని బాబునగర్ రామాపురం, నరసింహాపురం, కట్టకొమ్ములగూడెం, ఆర్లగూడెం, రామచంద్రనగర్, కొండాపురం, ఉత్తమ్ పద్మావతి కాలనీ తదితర గ్రామాల ప్రజలు వందలాది మంది శుక్రవారం బైపాస్ రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు మాట్లాడుతూ.. 65వ నంబర్ జాతీయ రహదారి మీదుగా నిత్యం సమీప గ్రామాల్లోని వందలాది మంది ప్రజలు ఆయా గ్రామాల నుండి కోదాడకు విద్య, వైద్యం, ఉపాధి కోసం వచ్చి వెళ్తుతుంటారని తెలిపారు. ఈ క్రమంలో రోడ్డు దాటేటప్పుడు వేగంగా వచ్చే వాహనాలు డీకొని వందలాది మంది చనిపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి నుండి బయల్దేరిన వ్యక్తి ఈ రహదారి దాటి ఇంటికి వచ్చే వరకు గ్యారెంటీ లేదని కన్నీటి పర్యంతమయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రోడ్డు దాటాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు.
గతంలో కూడా ప్లై ఓవర్ నిర్మించాలని పలుమార్లు ఆందోళనలు చేసినప్పటికి పట్టించుకోలేదన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి చొరవ చూపి బైపాస్ రోడ్డుపై ప్లై ఓవర్ నిర్మించాలని కోరారు. వందలాది మంది మహిళలు, పురుషులు రోడ్డుపై బైఠాయించడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. విషయం తెలుసుకున్న సీఐ శివశంకర్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వటంతో ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో రాయబారపు వెంకటేశ్వర్లు, పాయలు కోటేశ్వరరావు, గిద్దె రాజేశ్, వివిధ పార్టీల నాయకులు, మాజీ సర్పంచ్ నిగడాల వీరయ్య, తిపిరిశెట్టి సత్యమయ్య చారి, సందీప్, అయినాల ఉపేందర్, నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, తిప్పిరిశెట్టి వీరయ్య, రాయబారపు రాజేశ్, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.