కట్టంగూర్, నవంబర్ 7 : పత్తి కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది కలిగించే సీసీఐ విధించిన 7 క్వింటాళ్ల నిబంధనను వెంటనే ఎత్తివేయాలని బీఆర్ఎస్ రైతు విభాగం నల్లగొండ జిల్లా నాయకుడు చిట్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం కట్టంగూర్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ఒకవైపు వర్షాలకు పత్తి చేలు దెబ్బతిని దిగుబడి తగ్గిపోగా మరోవైపు సీసీఐ తీసుకొచ్చిన కొత్త నిబంధన రైతులకు తీవ్రంగా నష్టం చేకూర్చే విధంగా ఉందని అవేదన వ్యక్తం చేశారు. కపాస్ కిసాన్ యాప్ పై అవగాహన లేకపోవడం వల్ల పత్తి రైతులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. పత్తి రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సీసీఐ విధించిన నిబంధనలు ఎత్తివేసి పాత పద్దతిలో పత్తి కొనుగోలు చేయాలన్నారు. నిబంధన ఎత్తివేయకుంటే రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.