నల్లగొండ ప్రతినిధి, జూలై11(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అనధికారిక సెలవు కొనసాగింది. రాష్ట్ర ప్రధాన కార్యాలయ సర్వర్లో తలెత్తిన సాంకేతిక సమస్య పొద్దంతా వెంటాడింది. దాంతో సాయంత్రం ప్రభుత్వ కార్యాలయాల సమయం ముగిసే వరకు కూడా సమస్యకు పరిష్కారం దొరక్కపోవడంతో రిజిస్ట్రేషన్లన్నీ ఆగిపోయాయి.
రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన క్రయవిక్రయదారులు ఆయా కార్యాలయాల్లో రోజంతా పడిగాపులు కాశారు. జిల్లాలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్లాట్లు, ఇండ్లు, కమర్షియల్ భవనాల క్రమవిక్రయాలు జరుగుతుంటాయి. తాసీల్దార్ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ప్రక్రియ కొనసాగుతుంది. గురువారం ఉదయం 11 గంటల వరకు వీటిల్లో అన్ని సేవలు సవ్యంగానే కొనసాగాయి.
ఆ తర్వాత సర్వర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో సేల్ అండ్ గిఫ్ట్ డీడ్ల లాంటి రిజిస్ట్రేషన్లు అన్నీ నిలిచిపోయాయి. ప్రధానంగా సర్వర్లో తలెత్తిన సాంకేతిక సమస్యతో సబ్రిజిస్ట్రార్ల ఈకేవైసీ నిలిచిపోయింది. దాంతో వారు తమ రిజిస్ట్రేషన్ లాగిన్లోకి వెళ్లేందుకు వారి వేలిముద్ర పడలేదు. ఉదయం 11 నుంచి సాయంత్రం 5గంటల వరకు ఇదే పరిస్థితి కొనసాగింది.
మధ్యమధ్యలో ఎన్ని సార్లు ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మినహా ఇదే సమయంలో ఈసీ లాంటి ఇతర సేవల ప్రక్రియ యథావిధిగా కొనసాగినట్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయల అధికారులు తెలిపారు. ఇలాంటి సందర్భం చాలా అరుదుగా జరుగుతుందని పేర్కొన్నారు. ధరణి ప్రక్రియ అమల్లోకి వచ్చిన తర్వాత ఒక రోజంతా ఇలా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయిన సందర్భాలు మాత్రం లేవని చెబుతున్నారు.
రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో ముందు స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ప్రజలంతా రోజంతా కార్యాలయాల వద్ద పడిగాపులు కాశారు. ఒక్క నల్లగొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే ఒక్కరోజే 80 రిజిస్ట్రేషన్లు నిలిచిపోయినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఉదయం 11గంటల లోపు మాత్రమే రెండు రిజిస్ట్రేషన్లు పూర్తైనట్లు చెప్పారు. ఆ తర్వాత సాయంత్రం 5 గంటల వరకు వేచి చూసినా ఫలితం లేకపోయిందన్నారు. దాంతో గురువారం నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లన్నీ సర్వర్ సమస్య పరిష్కారమైతే రిజిస్ట్రేషన్లు చేస్తామని చెప్పి తిరిగి పంపించారు. గురువారం ఉదయం 11 గంటల నుంచి శుభ గడియలు ఉండడంతో ఎక్కువ మంది రిజిస్ట్రేషన్లకు ముహూర్తం పెట్టుకున్నట్లు తెలిసింది. మంచిరోజు కావడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు తాసీల్దార్ కార్యాలయాల్లో సైతం క్రయవిక్రయదారుల సందడి కనిపించింది. అయితే ఇగ వస్తుంది.. అగ వస్తుందన్న ఆశతో వీరంతా సాయంత్రం వరకు ఆయా కార్యాలయాల్లోనే వేచిచూశారు. తీరా సాయంత్రానికి కూడా పరిస్థితి అలాగే ఉండడంతో నిట్టూర్పుతో ఇంటిబాట పట్టారు.
మా ఆయన సచ్చిపోయి నాలుగు సంవత్సరాలు అయ్యింది. ఇంతకాలం భూమి పాస్బుక్ బ్యాంకులో ఉండడం వల్ల నా పేరు మీద భూమి చేయించుకోలేక పోయాను. వారం రోజుల కింద స్లాట్ బుక్ చేస్తే గురువారం వచ్చింది. అధికారులు మాత్రం కంప్యూటర్లో ప్రాబ్లం ఉందని సాయంత్రం వరకు ఆఫీసులోనే ఉంచారు. తీరా సాయంత్రం అయిన తర్వాత ఇప్పుడు కాదు రేపు రమ్మంటున్నారు. రేపయినా జరుగుతుందో లేదో.
– పల్లెబోయిన ఎల్లమ్మ తెప్పలమడుగు, పెద్దవూర