చౌటుప్పల్‌లో ట్రిపుల్ ఆర్ భూ మాయం… జంక్షన్… టెన్షన్ పేరుతో నమస్తే తెలంగాణ దినపత్రికలో సోమవారం ప్రచురించిన ప్రత్యేక కథనం ట్రిపుల్ ఆర్ ప్రాంతాల్లో సంచలనం సృష్టించింది. ఉత్తర భాగం ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్తోపాటు భూసేకరణకు అడుగులు పడుతుండగా… దక్షిణ భాగంతో మాత్రం రాష్ట్ర ప్రభుత్వ ఆటలాడుతుంది. కేంద్ర ప్రభుత్వాన్ని కాదని రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా అలైన్మెంట్తోపాటు నిర్మించాలనుకుంటున్నట్లు జరుగుతున్న పరిణామాలు చెప్తున్నాయి. అందువల్లే ఇష్టరాజ్యంగా అలైన్‌మెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుని మార్పులు చేస్తుండడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. కొత్తగా అనేక ప్రాంతాల్లో ట్రిపుల్ఆర్ అలజడులు మొదలయ్యాయి.
ఇలాగే చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో గతంలో 78 ఎకరాల్లో జంక్షన్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. కానీ రెండు నెలల కిందట ప్రభుత్వం ఉన్నట్లుండి 181 ఎకరాలకు జంక్షన్‌ను విస్తరణకు నిర్ణయించింది. జంక్షన్ విస్తరణ ఎందుకోసమని చెప్పే వారూ లేరు. అధికారులు నోరు మెదపరు. జిల్లా మంత్రి, స్థానిక ఎమ్మెల్యేలు తమకేమీ తెలియదని అంటుండడంతో స్థానికులకు కంటి మీద కునుకు కరువైంది. ఈ నేపథ్యంలో భాధితుల ఆవేదన, వారి ఆందోళన ను కండ్లకు కట్టినట్లు వివరిస్తూ జంక్షన్ విస్తరణలో ప్రభుత్వ కోణాన్ని ఆవిష్కరిస్తూ, జిల్లా మంత్రి, ఎమ్మెల్యే తీరును ఎండగడుతూ సోమవారం నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం ప్రచురించింది. ఆ కథనం స్థానికంగా సంచలనంగా మారింది.
సోమవారం పొద్దుగాల నుంచే నమస్తే తెలంగాణ కథనం స్థానికంగా సోషల్ మీడియా గ్రూప్స్‌లో వైరల్ అయ్యింది. జంక్షన్ విస్తరణలో భూములు, ఇండ్లు, ప్లాట్లు కోల్పోతున్న బాధితులు కథనాన్ని ఓన్ చేసుకుని తమ పరిధిలోని గ్రూపుల్లో షేర్ చేశారు. ట్రిపుల్ ఆర్ భాధితుల పేరుతో కొనసాగుతున్న పలు వాట్సాప్ గ్రూపుల్లో విస్తృతంగా షేర్ చేశారు. భాధితులంతా దీన్ని స్టేటస్లు, డీపీలుగా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. దాంతో ట్రిపుల్ ఆర్ ఏరియాల్లో రోజంతా కథనం కలకలం రేపింది. ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లోనూ షేర్ చేశారు. తమ గోడు ప్రభుత్వం వద్దకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా చేరేలా షేర్ చేశారు.
జంక్షన్‌ను పాత పద్ధతిలోనే నిర్మిచాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో 78 ఎకరాలే సరిపోగా ఇపుడు ఎందుకు ఒకేసారి 181 ఎకరాలకు పెరుగుతుందని నిలదీస్తునారు. ఎవరి కోసం తమ భూములు, ఇండ్లు, ప్లాట్లు గుంజుకోవాలని చూస్తున్నారో చెప్పాలని కోరుతున్నారు. తెలంగాణ బిడ్డల ఆస్తులను ఫణంగా పెడుతూ ఇతర ప్రాంత ప్రయాణికుల విందు, వినోదల కోసం జంక్షన్ విస్తరణ చేయడాన్ని అడ్డుకుంటామని చెప్తున్నారు. అవసరమైతే న్యాయపోరాటానికి సిద్ధమని నిర్వాసితుల పక్షాన ట్రిపుల్ బాధిత సంఘం నాయకులు బూర్గు కృష్ణారెడ్డి, చింతల దామోదర్‌రెడ్డి స్పష్టం చేశారు. నమస్తే తెలంగాణ కథనంతోనైనా ప్రభుత్వం, పాలకులు భాధితుల గోడు అర్ధం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
న్యాయ పోరాటానికి సన్నద్ధం
ట్రిపుల్ ఆర్ చౌటుప్పల్ జంక్షన్ భాధితులు న్యాయపోరాటానికి కూడా సిద్ధం అవుతున్నట్లు తెలిసింది. ఒక వైపు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ వేదికలపై ప్రజా ప్రతినిధులు, అధికారులకు తమ గోడును వెళ్లబుచ్చుతూనే మరోవైపు న్యాయ పరంగా జంక్షన్ పరిది పెంచదాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు. ట్రిపుల్ ఆర్‌లో ఎక్కడా లేనివిధంగా చౌటుప్పల్ జంక్షన్‌నే ఎందుకు రెండున్నర రెట్లు పెంచి విస్తరిస్తున్నారని ప్రశ్నించునున్నట్లు తెలిపారు. ట్రిపుల్ ఆర్కు తాము వ్యతిరేకం కాదంటూనే జంక్షన్ పరిధి పాత పద్ధతిలోనే ఉండేలా చూడాలని కోరుతున్నారు. ఇక ఈ జంక్షన్ వళ్ల చౌటుప్పల్ మున్సిపాలిటీ కూడా రెండుగా చిలిపోతుందని, అభివృద్ధి కూడా కుంటుపడుతుందని బాధితులతోపాటు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెరపైకి మంత్రి కోమటిరెడ్డి వీడియోలు..
ట్రిపుల్ ఆర్ భాధితులతో గతంలో ఎంపీగా ఉన్నపుడు, ఇప్పుడు మంత్రి అయ్యాక కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహార శైలిపై నమస్తే తెలంగాణ కథనంలో పేర్కొన్న అంశాలపై కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గతంలో రాయగిరి రైతుల పక్షాన మాట్లాడిన మాటలను మరోసారి వైరల్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక, కోమటిరెడ్డి మంత్రి అయ్యాక కూడా చాలా సార్లు కలిసే ప్రయత్నం చేశారు. అపుడు అల్న్మెంట్ మార్చుతామని, బాధితులకు బహిరంగ మార్కెట్ ప్రకారం పరిహారం ఇస్తామని చెప్పిన మాటలు సోషల్ మీడియా వేదికగా గుర్తు చేశారు.
మంత్రి అయ్యాక కూడా ప్రారంభంలో చాలాసార్లు ’ఆ డిపార్ట్మెంట్ నాదే… రోడ్ నాదే… అలైన్మెంట్ మార్చేద్దాం’ అని చెప్తున్న వీడియోను వైరల్ చేశారు. ఇపుడేమో రాయగిరి రైతులకు టైమ్ ఇవ్వకుండా మొహం చాటేస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. రెండు నెలల నుంచి చౌటుప్పల్ జంక్షన్ బాధితులు పలుమార్లు కలిస్తే నాకేం తెల్వదు… సీఎం రేవంత్‌రెడ్డే చూస్తున్నడు.. ఆయన్నే అడుగండి అంటూ తప్పించుకుంటాన్నాడని భాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొద్దున లేస్తే రేవంత్ రెడ్డికి చాలా దగ్గర అని చెప్పుకొనే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి… ఎందుకు తమ జంక్షన్ పరిధిని పెంచకుండా అడ్డుకోరని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.
అప్పుడు అంటే ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ కేంద్రం చేతిలో ఉండగా దక్షిణ భాగం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో అలైన్మెంట్ ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డిపై ఒత్తిడి తెచ్చి ఎందుకు పరిధి పెంచకుండా మంత్రి అడ్డుకోడని ప్రశ్నిస్తునారు. రేవంత్ రెడ్డి ఇచ్చే కాంట్రాక్టుల కోసం ట్రిపుల్ ఆర్‌పై మాట్లాడుతలేరేమో అని ట్రిపుల్ ఆర్ నిర్వసితుల వాట్సాప్ గ్రూపుల్లో భాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ తలుచుకుంటే జంక్షన్ పరిధి పెంపు, అలైన్మెంట్ మార్పు ఆగదా అని ప్రశ్నిస్తున్నారు.
మూడుసార్లు భూములు తీసుకున్నరు
ఇప్పటికే మూడుసార్లు భూములు తీసుకున్నరు. అయినా సప్పడు చేయలేదు. మళ్లీ ఇప్పుడు భూమి ఇవ్వమంటుండ్రు. మేమెట్ల బతుకాలి. కాయకష్టం చేసుకుని చిన్నతనం నుంచి భూమిని నమ్ముకొని బతికినం. ప్రాణం పోయినా భూమి ఇచ్చేది లేదు. ఉన్న భూమిపోతే రోడ్డు మీద పడాల్సిందే. చూసే దిక్కు కూడా ఉండడు.
-జాల యాదయ్యయాదవ్, రైతు, చౌటుప్పల్
పాలకులు పట్టించుకోవడం లేదు
ట్రిపుల్ బాధిత రైతులకు న్యాయం చేసే విషయంలో కాంగ్రెస్ పాలకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఎన్నిసార్లు వెళ్లినా రైతుల సమస్యను పైకి తీసుకెళ్తామని చెప్పుతుండ్రు. లేదా బహిరంగ ధర ఇప్పిస్తాం అన్నరు. ఇప్పుడు ఎవరూ సప్పుడు చేయడం లేదు. ఇక్కడ జంకన్ వస్తే చౌటుప్పల్ మున్సిపాలిటీ రెండుగా చీలి అభివృద్ధి కూడా కుంటుపడుతుంది. ఈ ప్రాంతం అవతలివైపునకు అలైన్‌మెంట్‌ను మార్చాలి.
-గుండెబోయిన వేణుయాదవ్, రైతు, తంగడపల్లి
రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు ఎందుకు మార్చరు
దక్షిణ భాగం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదని అంటున్నరు. మాది దక్షిణ భాగమే కాదా.. జంక్షన్ మార్చే అవకాశం ఉంటుందిగా. ఎందుకు ఇక్కడి రైతులను పట్టించుకోరు. మా తరపున అడిగే పెద్దలు ఎవరూ లేరా. రైతులను చిన్నచూపు చూపడం మానుకోవాలి.
-జాల జంగయ్య యాదవ్, రైతు, తంగడపల్లి
మా పిల్లల భవిష్యత్ ఏంది?
కొన్నేండ్ల నుంచి పరిశ్రమల కాలుష్యం మూలంగా పంటలు పండడం లేదు. ఇప్పటికే ఎంతో ఆర్థికంగా నష్టపోయాం. అయినా భూమి ఉందన్న ధీమాతో కష్టం చేసుకుని బతుకువెళ్లదీస్తున్నం. ఇప్పుడు రింగు రోడ్డు అని భూమి గుంజుకుంటే ఎట్లా? ఉన్నా భూమి పోతే మా పిల్లల భవిష్యత్ ఏంది?
-జాల అంజయ్య యాదవ్, రైతు, చౌటుప్పల్