నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్4(నమస్తే తెలంగాణ)/ శాలిగౌరారం/ తిరుమలగిరి/ తుంగుతుర్తి : తనకు సంబంధం లేకున్నా డీజిల్ దొంగతనం పేరుతో ఎస్ఐ తీవ్రంగా కొట్టాడన్న ఆవేదనతో నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఆకారంలో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జరిగింది. తనకు రావాల్సిన జీతం అడిగినందుకు స్టోన్ క్రషర్ యజమాని ప్రోద్బలంతో ఎమ్మెల్యే.. ఎస్ఐకి చెప్పాడని, ఎస్ఐ స్టేషన్కు పిలిపించి ఇష్టం వచ్చినట్లు కొట్టాడంటూ బాధిత యువకుడు నాగరాజు ఊరి తాడు బిగించుకుని సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. ‘నాకు ఏ పాపమూ తెల్వదు. ఎన్నడన్న స్టేషన్కు పోయినోడిని కాదు. ఎవ్వని జోలికి కూడా పోయినోడిని కాదు.
నన్ను ఇరికించారు’ అంటూ వీడియాలో కన్నీటి పర్యంతం అయ్యాడు. బాధిత కుటుంబ సభ్యులు, సెల్పీ వీడియాలో ఉన్న వివరాల మేరకు… శాలిగౌరారం మండలం ఆకారం గ్రామానికి చెందిన శనిగ నాగరాజు సూర్యాపేట జిల్లా తొండ గ్రామంలోని గొలుసుల వెంకన్న నిర్వహణలో ఉన్న బాలాజీ స్టోన్ క్రషర్ మిల్లులో ఆరు నెలల నుంచి టిప్పర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. యజమాని వద్దనడంతో అక్కడ పని మానేశాడు. ఈ క్రమంలో రెండు నెలల జీతం రావాల్సి ఉందని నాగరాజు కొద్దిరోజుల కిందట యజమానికి ఫోన్ చేశాడు. యజమాని జీతం ఇవ్వకపోగా తన కంపెనీలో డీజిల్ దొంగతనం జరిగిందంటూ నాగరాజుతోపాటు మరికొందరిపై తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
వెంకన్న స్థానిక ఎమ్మెల్యేను సైతం ఆశ్రయించి ఎస్ఐకి ఫోన్ చేయించినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తిరుమలగిరి ఎస్ఐ వంటెపాక సురేశ్ నాలుగైదు రోజులుగా నాగరాజుకు ఫోన్ చేస్తూ స్టేషన్కు రమ్మంటున్నాడు. తనకు సంబంధం లేదని నాగరాజు వెళ్లకపోయే సరికి బుధవారం సాయంత్రం ఎస్ఐ ఫోన్ చేసి తీవ్రంగా మందలించినట్లు తెలిసింది. గురువారం ఉదయం నాగరాజు తన బావమరిదితోపాటు తమ్ముడిని వెంట పెట్టుకుని తిరుమలగిరి పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. అక్కడికి వెళ్లాక ఎస్ఐ విచారణ పేరుతో నాగరాజుతోపాటు అతడి తమ్ముడిని తీవ్రంగా చితకబాది మళ్లీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని ఆదేశించి సాయంత్రం వదిలిపెట్టాడు.
తనకు ఏ సంబంధమూ లేని కేసులో ఇరికించి ఇష్టమొచ్చినట్లు చితకబాదడంతో నాగరాజు తీవ్ర మనస్థాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. రాత్రంతా ఆవేదనతో ఉన్న నాగరాజు శుక్రవారం ఉదయం ఆకారంలోని తన వ్యవసాయ భూమిలో చింత చెట్టుకు తాడు వేసి మెడకు బిగించుకుని సెల్ఫీ వీడియాలో మాట్లాడాడు. అనంతరం ఉరి వేసుకున్నాడు. అటు నుంచి వెళ్తున్న కొందరు గమనించి నాగరాజును కిందకు దించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యులు అక్కడి నుంచి నల్లగొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం శనివారం సాయంత్రం హైదరాబాద్కు తీసుకెళ్లారు. నాగరాజుకు భార్య, ఒక కూతురు ఉన్నట్లు ఆయన బంధువులు తెలిపారు.
నాగరాజు సెల్పీ వీడియోలో మాట్లాడుతూ.. ‘తమ్ముడూ సాయి. నేను లేకున్నా నన్ను ఇందులో ఇరికించిండ్రు. ఎస్ఐ అయితే ఇష్టం వచ్చినట్లు కొట్టిండు. గోసుల వెంకన్న చెప్తే ఎమ్మెల్యే చెప్పిండని ఎస్ఐ కొట్టిండు. నా ఇళ్లు ముంచిండు గొలుసుల వెంకన్న. గిరిగాడూ చేసిండు. ఎస్ఐ సురేశ్, కృష్ణ, కాంత్రి చేసిండ్రు. వీడు పిరికోడు సచ్చిపోయిండు అని అందరూ అనుకోవచ్చు. నేను ఎన్నడన్న స్టేషన్కు పోయినోడిని కాదు. ఎవ్వని జోలికి పోయినోడిని కాదు. నన్ను ఇరికించిండ్రు. వీరస్వామి కలుస్తరా. సాయి కలుస్తరా తమ్ముడూ… నేను మళ్లీ పుడితే కలుస్త’ అంటూ కన్నీళ్ల పర్యంతమయ్యాడు.
ఆకారం గ్రామానికి చెందిన టిప్పర్ డ్రైవర్ నాగరాజు ఆత్మాహత్యాయత్నానికి, తనకు సంబంధం లేదని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. శుక్రవారం తుంగతుర్తి మండల పరిధిలోని వెలుగుపల్లిలో మీడియాతో ఆయన మాట్లాడారు. తిరుమలగిరి మండలం తొండ గ్రామంలోని బాలాజీ క్రషర్ మిల్లులో డ్రైవర్గా పని చేస్తున్న నాగరాజు, కొంతమంది కార్మికులకు యాజమాని గొలుసుల వెంకన్న వేతనాలు ఇవ్వకుండా వారిపై డీజిల్ దొంగతనం కేసు పెట్టాడని కాంగ్రెస్ నాయకులు తనకు ఫోన్ చేస్తే తానే ఎస్ఐకి ఫోన్ చేసి ఇరువురు బయటి మాట్లాడుకుంటారు, వదిలి పెట్టండని చెప్పానన్నారు. కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా పోలీస్ కేసులు పెట్టి ఇబ్బందులు పడుతున్న గొలుసుల వెంకన్నను పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలన్నారు.
తన క్రషర్ మిల్లులో డ్రైవర్గా పని చేస్తున్న నాగరాజు డీజిల్ దొంగతనం చేస్తున్నాడని మిల్లు యజమాని గొలుసు వెంకన్న స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాంతో నాగరాజును పిలిపించి అడిగాము. తాను దొంగతం చేసింది వాస్తమని నాగరాజు ఒప్పుకొన్నాడు. తాము ఇరువురం మాట్లాడుకుంటామని చెప్పి పేపర్ కూడా రాసిచ్చాడు. ఇప్పుడు ఎస్ఐ కొట్టిన దెబ్బలకు మనస్థాపం చెందానని, ఎమ్మెల్యే కొట్టమంటేనే కొట్టాడని చెప్పడం అవాస్తవం. నాగరాజును నేను కొట్టలేదు. వేధించలేదు. ఎమ్మెల్యే మాకేమీ చెప్పలేదు.
– సురేశ్, తిరుమలగిరి ఎస్ఐ