నేరేడుచర్ల, మే 16: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పంచాయతీలకు ఆదాయం సమకూర్చాలనే లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీల్లో సెగ్రిగేషన్ షెడ్లు నిర్మించింది. అయితే, వీటి నిర్వహణను అధికారులు పట్టించుకోకపోవడంతో రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన షెడ్లు నిరుపయోగంగా మారాయి. గ్రామాల్లో చెత్తను బహిరంగ ప్రదేశాల్లో పడేయడం ద్వారా వాటిలోని రసాయనిక పదార్థాలు భూమిలోకి చేరి తద్వారా నేల, నీరు కలుషితమవుతాయి. చెత్త కుళ్లిపోయి దుర్గంధం, కాల్చడం వల్ల వెలువడిన పొగతో పర్యావరణం దెబ్బతింటుంది. దీంతో పల్లెల్లో కాలుష్యాన్ని నివారించి పర్యావరణహిత గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణం చేపట్టారు. అయితే, షెడ్లు నేడు అనేక అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారుతున్నాయని, అయినా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి గ్రామ పంచాయతీలో సెగ్రిగేషన్ షెడ్ నిర్మాణానికి రూ. 2.50 లక్షలు ఖర్చు చేశారు. ఇండ్ల నుంచి సేకరించిన తడి, పొడి చెత్తను వేరు చేసి ఎరువుగా మారే పదార్థాలను సెగ్రిగేషన్ షెడ్డులోని గుంతల్లో వేస్తారు. సేంద్రియ ఎరువుగా మారిన అనంతరం గ్రామ పంచాయతీల పరిధిలో హరితహారంలో నాటిన మొక్కలు, నర్సరీలతో పాటు రైతులకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎరువును అమ్మగా వచ్చిన సొమ్మును గ్రామ పంచాయతీ అభివృద్ధికి వినియోగించాలని భావించారు. అదేవిధంగా సేకరించిన చెత్తలోని ప్లాస్టిక్ బాటిళ్లు, గాజు సీసాలు, ఇతర వస్తువులను విక్రయించడం ద్వారా పంచాయతీలకు ఆర్థిక వనరులు చేకూరుతాయనే లక్ష్యంతో ప్రారంభించిన ఈ పథకం కొన్ని చోట్ల అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతుంది. ప్రస్తుతం అనేక గ్రామ పంచాయతీల్లో ఈ షెడ్లను ఉపయోగించడం లేదు.
ప్రతి గ్రామ పంచాయతీకి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక ట్రాక్టర్‌తో పాటు వాటర్ ట్యాంకర్‌ను కేటాయించింది. గ్రామాల్లో తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించేందుకు ఇంటింటికి బుట్టలు పంపిణీ చేశారు. కానీ చాలా మంది తడి, పొడి చెత్తను వేరు చేయకుండా పంచాయతీ సిబ్బందికి ఇష్టానుసారంగా అందజేస్తున్నారు. పారిశుధ్య సిబ్బంది వాటిని చెత్తను వేరు చేసి షెడ్లలో వేసి ఎరువు తయారు చేయాలి. ఇలా తయారైన ఎరువులను గ్రామ పంచాయతీ విక్రయించి అదనపు ఆదాయాన్ని పెంచుకోవాలన్నదే వీటి ఉద్దేశం. కానీ చాలా గ్రామాల్లో ఎరువు తయారు చేస్తున్న దాఖలాలు కనపడటం లేదు.