ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు రేపటి నుంచి రెండో విడుత ఈవెంట్స్ నిర్వహించనున్నారు. నల్లగొండలోని మేకల అభినవ్ స్టేడియంలో ఈ నెల 20 వరకు ఆరు రోజులపాటు సర్టిఫికెట్ల పరిశీలనతోపాటు దేహ దారుఢ్య పరీక్షలు చేపట్టనున్నారు.ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 4,790 మంది అభ్యర్థులు ఉండగా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 6 గంటలకు ఈవెంట్స్ ప్రారంభం కానుండగా అభ్యర్థులు గంట ముందే గ్రౌండ్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. ప్రతి రోజూ వెయ్యి మంది చొప్పున పాల్గొనేలా బ్యాచ్‌లను ఏర్పాటు చేశారు.
ఏడు మార్కులు కలుపడంతో..
రాష్ట్ర ప్రభుత్వం ప్రిలిమినరీ పరీక్ష రాసిన అభ్యర్థులకు ఏడు మార్కులు అదనంగా కలిపింది. దాంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 4,790 మందికి ఊరట కలిగింది. వీరికి మరో దఫా ఈవెంట్స్‌తోపాటు సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నారు. మొదట జిల్లాలో 26,433 మంది ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించగా ఏడు మార్కులు కలుపడంతో అదనంగా 4,790 మంది పెరిగారు. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 31,223 అభ్యర్థులు అర్హత సాధించారు. తొలి విడుత ఈవెంట్స్‌లో 12,124 మంది ఎంపికయ్యారు. ఇందులో 3,402 మంది పురుషులు,1388 మంది మహిళలు ఉన్నారు.
మొదట పురుష అభ్యర్థులకు..
తొలి మూడు రోజులు పురుషులు, ఆ తర్వాత రెండు రోజులు మహిళలకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు. అక్రమాలకు తావు లేకుండా సీసీ కెమెరాలు, ఆర్ఎఫ్ఐడీ(రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ రీడర్) పర్యవేక్షణలో ఈవెంట్స్ చేపట్టనున్నారు. బయోమెట్రిక్ ద్వారా అభ్యర్థులను అనుమతించనున్నారు. ఈవెంట్స్‌లో రన్నింగ్, షాట్‌పుట్, హైజంప్, లాంగ్‌జంప్ నిర్వహించనున్నారు.
అభ్యర్థులు ఇవి పాటించాలి
మాయమాటలు నమ్మొద్దు
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పకడ్బందీగా, పారదర్శకంగా జరుగుతుంది. ఎవరైనా తప్పుడు మార్గంలో ఉద్యోగం ఇప్పిస్తామని, ఉద్యోగం వచ్చే విధంగా సహాయం చేస్తామని చెబితే నమ్మొద్దు. ప్రతి అంశం హై టెక్నాలజీతో ముడిపడి ఉంటుంది. అక్రమాలకు తావు లేకుండా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈవెంట్స్ జరుగుతాయి.
-కె. అపూర్వరావు, నల్లగొండ జిల్లా ఎస్పీ