నల్లగొండ, జూన్ 14 : ప్రస్తుతం పాఠశాలలు తిరిగి ప్రారంభమైనందున జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలలు, వసతి గృహాలు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ఆహారంలో నాణ్యతను కొనసాగించాలని జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి సూచించారు. జిల్లా పరిషత్‌లో బుధవారం ఒకటవ(ఆర్థికం), ఏడవ(పనులు), రెండవ(గ్రామీణాభివృద్ధి), మూడవ(వ్యవసాయం), ఐదవ(స్త్రీ శిశు సంక్షేమం), ఆరవ(సాంఘిక సంక్షేమం) స్థాయి సంఘ సమావేశాలు జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డితో పాటు ఆయా స్థాయి సంఘాల చైర్మన్ల అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా బండ నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. ఈ విద్యా సంవత్సరంలో పదిలో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. ట్రాన్స్ఫార్మర్ల బిగింపు గాకుండానే అధికారులు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారని, అలాగాకుండా పని పూర్తై రైతుల సంతకాలు తీసుకున్నాకే బిల్లులు ఇవ్వాలని ఆదేశించారు.
నార్కట్‌పల్లిలో స్కూల్ పక్కన బెల్టు షాపు నిర్వహిస్తుండడంతో మందు తాగి స్కూల్లోకి బాటిల్స్ పడేస్తున్నారన్నారు. వెంటనే బెల్టు షాపును మూయించాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. తిప్పర్తిలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం, గంగన్నపాలెం రోడ్డు పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. తిప్పర్తిలో లోవోల్టేజీ సమస్య ఉందని జడ్పీటీసీ సభ దృష్టికి తెచ్చారు. మండలంలో మైనింగ్ పర్మీషన్ ఇచ్చి దాన్ని పర్యవేక్షించకపోవడం వల్ల ఎక్కువ మట్టిని తరలిస్తున్నారని నాంపల్లి జడ్పీటీసీ, 15వ ఆర్థిక సంఘం నిధులు జనాభా ప్రాతిపదికన ఇవ్వాలని శాలిగౌరారం జడ్పీటీసీలు కోరారు. జనుము, జీలుగు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని 3వ స్థాయి సంఘం చైర్మన్ ఇరిగి పెద్దులు కోరారు. రైతు బంధు, బీ మాకు దరఖాస్తు చేసుకోని వారితే ఏఈఓలే దరఖాస్తు చేసేలా చర్యలు తీసుకోవాలని చండూరు జడ్పీటీసీ కోరారు. సీడీపీఓలు మహిళలను దృష్టిలో పెట్టుకుని నిర్వహిస్తున్న కార్యక్రమాలు బాగున్నాయని, దశాబ్ది ఉత్సవాల్లో వారు ఉత్సాహంగా పాల్గొంటున్నారని ఐదో స్థాయీ సంఘం చైర్మన్ కంకణాల ప్రవీణ అన్నారు. గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్యకు ప్రభుత్వం ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.1.25లక్షలు ఖర్చు చేస్తున్నందున ఆ నిధులు సద్వినియోగం అయ్యే లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ఆరో స్థాయీ సంఘం చైర్మన్ స్వరూపారాణి సూచించారు. సమావేశంలో సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, డిప్యూటీ సీఈఓ కాంతమ్మ పాల్గొన్నారు.