నల్లగొండ అర్బన్/ రామగిరి/ మిర్యాలగూడ/ సూర్యాపేట/ హుజూర్నగర్, ఆగస్టు 2 : ఇటీవల ఉద్యోగోన్నతులు పొందిన గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులతో శుక్రవారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నల్లగొండ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో 23 ప్రత్యేక బస్సుల్లో ఆయా విభాగాల్లో ఉద్యోగోన్నతులు పొందిన 1,153 మంది ఉపాధ్యాయులు సభకు వెళ్లారు.
ప్రతి స్కూల్లో 6నుంచి 8మంది ఉపాధ్యాయులు ఉద్యోగోన్నతి పొందగా.. వారంతా సభకు వెళ్లడంతో పాఠాలు బోధించేవారు లేక విద్యార్థులు బయట తిరిగారు. కొన్ని స్కూళ్లలో ఒక్క ఉపాధ్యాయుడు కూడా లేని పరిస్థితి నెలకొంది. మరికొన్ని స్కూళ్లలో ఒకరిద్దరు టీచర్లు ఉండడంతో విద్యార్థులు పాఠశాల ఆవరణలో కాలక్షేపం చేశారు. మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి వెళ్లే ఉపాధ్యాయుల వాహనాలకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. పని దినాల్లో పాఠాలు చెప్పకుండా ఉపాధ్యాయులు సభకు వెళ్లడం ఏమిటని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
జిల్లాలో సుమారు 3,600 మంది ఉపాధ్యాయులు ఉండగా.. ఒకే రోజు 800 మందికి పైగా సభకు వెళ్లడంతో విద్యా సంవత్సరంలో విలువైన ఒక రోజు తరగతులను విద్యార్థులు కోల్పోయారు. జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో సగానికిపైగా ఉపాధ్యాయులు సభకు వెళ్లడంతో తరగతుల నిర్వహణ సక్రమంగా లేకపోయింది. దీంతో పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులకు పనిభారం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు సెలవు దినాల్లో నిర్వహించుకోవాలని
సూచిస్తున్నారు.
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సీఎం ముఖామఖి కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉద్యోగోన్నతులు పొందిన 800 మంది ఉపాధ్యాయులను జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో తరలించారు. ఇందుకోసం సూర్యాపేట డిపో పరిధిలోని 18 ఆర్టీసీ బస్సులను తీసుకెళ్లారు. పాఠశాల పని దినాల్లో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఒకరిద్దరు ఉన్న పాఠశాలల విద్యార్థులు తరగతుల నిర్వహణ లేకపోవడంతో బయట తిరిగారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో ప్రమోషన్లు పొందిన 228 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు నాలుగు బస్సుల్లో సీఎం ముఖాముఖి కార్యక్రమానికి వెళ్లారు. వారికి ఆర్టీఓ శ్రీనివాసులు అల్పాహారం ఏర్పాటు చేశారు.
జిల్లా వ్యాప్తంగా సభకు వెళ్లిన వారిలో ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు 113మంది, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ – 43, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిషు – 30, స్కూల్ అసిస్టెంట్ హిందీ – 95, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ – 48, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఉర్దూ – 1, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ – 83, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ – 3, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ – 69, స్కూల్ అసిస్టెంట్ తెలుగు – 127, స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ – 3, ఇతరులు 185 మంది ఉన్నారు. ఉపాధ్యాయుల తరలింపు కోసం ఒక బస్సుకు రూ.25వేలు ఖర్చు చేయనున్నారు. 18 బస్సులకు 4.50లక్షలు ఆర్టీసీకి చెల్లించాల్సి ఉన్నది. అయితే.. ఆర్టీసీ బస్సులను సభకు తీసుకెళ్లడంతో గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
ప్రమోషన్ ఇచ్చిన వారికి ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో మీడియా, షోషల్ మీడియా ద్వారా ఇలాంటివి నిర్వహించి ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేస్తే సరిపోయేది. జిల్లా నుంచి ఒకేరోజు 800 మందిని, రాష్ట్ర వ్యాప్తంగా 24వేల మంది ఉపాధ్యాయులను తరలించడం ఆలోచించదగిన విషయం. సీఎం కార్యక్రమానికి సగానికిపైగా ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు వెళ్లడం మూలంగా విద్యార్థులు ఒకరోజు నష్టపోయారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
– దామర శ్రీనివాస్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు, తిరుమలగిరి