ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పైలెట్ గ్రామాల్లో పథకాలను పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఎంపిక చేసిన గ్రామాల్లో నాలుగు పథకాలను తూతూమంత్రంగా అమలు చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారుల హడావుడి, హంగామా తప్ప.. అర్హులకు ఫలాలు అందించడంలో విఫలమయ్యారు. ఒక్క రైతు భరోసా మినహా ఇందిరమ్మ ఇండ్లు, రైతు ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు ప్రొసీడింగ్ పత్రాలకే పరిమితమయ్యాయి. అనేక మందికి ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. అర్హులు ఉన్నా
రేషన్ కార్డులు పెండింగ్లో పెట్టారు.
ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఆహార భద్రత (రేషన్ కార్డు), ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు జనవరి 26ర శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జిల్లాలోని 17 మండలాల్లో ప్రతి మండలంలో ఓ గ్రామాన్ని ఎంపిక చేసి, సంక్షేమ పథకాల అమలు కార్యక్రమాన్ని ప్రారంభించింది. తొలుత ఎంపిక చేసిన గ్రామంలోనే పథకాలు అమలు చేశారు. లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను అందించారు. ఆ సమయంలోనే తమకు అన్యాయం జరిగిందంటూ అనేక చోట్ల ప్రజలు నిరసన వ్యక్తం చేశారు.
ప్రారంభంకాని ఇండ్ల నిర్మాణాలు
ఇందిరమ్మ ఇండ్లు జిల్లా మొత్తం దేవుడెరుగు.. ఎంపిక చేసిన గ్రామాల్లోనూ ఇప్పటి వరకు నిర్మాణాలు ప్రారంభం కాలేదు. కేవలం ప్రొసీడింగ్ కాపీలు అందించి.. చేతులు దులుపుకొన్నారు. అనేక గ్రామాల్లో ముగ్గు పోయడం ప్రారంభ దశలోనే ఉంది. మంజూరు పత్రాలు ఇచ్చి నెలన్నర కావస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఆలేరు మండలంలోని మంతపురి గ్రామంలో 166 మంది దరఖాస్తు చేసుకోగా, కేవలం 49 మందికి మాత్రమే ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చారు. ఒక్కో గ్రామంలో 50 మంది దాటకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తున్నది.
రేషన్ కార్డుల పరేషాన్..
రేషన్ కార్డులకు ఇబ్బందులు తప్పడంలేదు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిలో 30b శాతం మందికి కూడా ఇవ్వలేదు. పూర్తిగా అర్హులైన వారంటూ పరిమిత సంఖ్యలో జాబితా తయారు చేసి.. ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చారు. వీరి రేషన్ కూడా సరిగా ఇవ్వడంలేదు. ఇక మిగతా వారిలో అర్హులు ఉన్నా.. అప్పటికే తల్లిదండ్రుల రేషన్ కార్డులో పేరుండటంతో పెండింగ్ పెట్టారు. ఇప్పుడు వీళ్లే వందల సంఖ్యలో ఉన్నారు. అయితే ముందుగా రేషన్ కార్డు నుంచి పేరు తొలగించుకోవాలని ప్రభుత్వం చెబుతున్నది. ఆ తర్వాత మళ్లీ కొత్త రేషన్ కార్డులో నమోదు చేసుకోవాలంటున్నది. ఈ నేపథ్యంలో ముందుగా కార్డులో పేరు తీసేశాక.. కొత్త రేషన్ కార్డుల్లో మళ్లీ ఎప్పుడు జత చేస్తారో..? లేదోననే ఆందోళన వ్యక్తమవుతున్నది. దీంతో అనేక మంది పాత రేషన్ కార్డుల్లో డిలీట్ చేయించకుండా.. అలాగే ఉంచుతున్నారు. మంతపురిలో 120 మంది కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోగా, తొలుత 22మందికి ప్రొసీడింగ్ కాపీ లు ఇచ్చారు. ఇంకా 51మంది అర్హులు ఉన్నా.. పాత రేషన్ కార్డులో పేరుందని పెండింగ్లో పెట్టారు. యాదగిరిగుట్ట మండలంలోని సైదాపురం గ్రామంలో 91 మంది దరఖాస్తు చేసుకోగా, ఒక్కరికీ రాలేదు.
పంచాయితీలు తెచ్చిపెడుతున్న ఇండ్లు
ఒక్క ఇంట్లో తల్లిదండ్రులతోపాటు పళ్లైన ముగ్గురు కొడుకులు ఉండి.. ఇల్లు నిర్మించుకోవడానికి స్థలం ఉన్నప్పటికీ ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇండ్ల పథకంలో చోటు కల్పించలేదు. ఇక అనేక మంది ఇప్పటికే పెంకుటిల్లు, రేకుల ఇండ్లలో ఉంటున్నారు. ముందుగా ఇల్లు కూలగొట్టి నిర్మిస్తేనే తర్వాత డబ్బులు చేయనుంది. ఈ నేపథ్యంలో ఉన్న ఇల్లు కూలగొట్టుకున్నా సర్కారు ఇవ్వకుంటే పరిస్థితి ఏంటనే ఆందోళనలో కొందరు ఉన్నారు. మరోవైపు ఇందిరమ్మ ఇండ్లు కుటుంబాల్లో కుంపటి కూడా పెడుతున్నాయి. ఒక ఇంట్లో ఇద్దరు కొడుకులు ఉంటే.. ఒక కొడుక్కి మంజూరు చేసి, ఇంకో కొడుక్కి ఇప్పుడున్న ఇంటినే లెక్కకట్టారు. ఇందిరమ్మ ఇల్లు కట్టడానికి తన పాలు జాగాను కూలగొట్టి కట్టుకునేందుకు ఇంకో కొడుకు ఒప్పుకోవడంలేదు. ఇలాంటి పంచాయితీలు ఇప్పుడు గ్రామాల్లో పెద్ద మనుషుల దాకా వెళ్లాయంటే అతిశయోక్తి కాదు.
మూడు కుటుంబాల్లో ఒకరికీ ఇల్లు రాలే..
మేం ముగ్గురం అన్నదమ్ములం. అందరికీ పెళ్లి అయ్యింది.తల్లిదండ్రులతో పాటు అందరం ఒకే ఇంట్లో ఉంటున్నాం. ఇంటి నిర్మాణం కోసం జాగా కూడా ఉంది. ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నాం. ఒకరికి కూడా మంజూరు కాలేదు. అధికారులను అడిగితే మీ నాన్నకు ఇల్లు ఉంది కదా అంటున్నారు. మేమంతా ఎకడ ఉండాలి. ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి.
– దంతూరి పరశురామ్, మంతపురి, ఆలేరు మండలం