తిప్పర్తి,ఆగస్టు 31: తమ పిల్లలు హాస్టల్లో ఉంటూ ఉన్నత చదువులు చదివి ప్రయోజకులవుతారనే తల్లిదండ్రులు భావిస్తుంటే..శిథిలమైన ఆ హాస్టల్లో ఉండలేమంటున్నారు విద్యార్థులు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా హాస్టల్లో ఉండే 100 మంది నిరుపేద పిల్లలు చదువులకు దూరమయ్యే పరిస్థితి దాపురించింది. తిప్పర్తిలోని ఎస్సీ బాలుర వసతి గృహం శిథిలావస్థకు చేరింది. భవనంతో పాటు సమస్యలు కూడా విద్యార్థులను బాధిస్తున్నాయి. దీంతో ఇండ్లకు వెళ్తామంటున్నారు విద్యార్థులు.
భవనం శిథిలం కావడంతో పెచ్చులతో పాటు పైకప్పు రేకులు విరిగిపోవడంతో వర్షం వస్తే కూర్చొని అన్నం తినలేని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు పెచ్చులూడి ఎక్కడ మీదపడతాయోనని భయంతో విద్యార్థులు కాలం గడుపుతున్నారు. విద్యార్థులు పడుకునే గదులకు కిటికీలు, తలుపు విరిగిపోయాయి. దీంతో రాత్రి వేళల్లో దోమలు వస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గదుల్లో ఫ్యాన్లు, స్విచ్ బోర్డులు సరిగా లేవు. స్టడీ అవర్‌లో కరెంట్ లేకపోవడంతో బయటే కూర్చోని చదువుకోవాల్సిన పరిస్థితి ఉంది.
అంతేకాకుండా కరెంట్ సమస్య తీవ్రంగా ఉంది. మూడు రోజుల కింద రాత్రి సమయంలో మీటర్ కాలిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అదే విధంగా వైర్లు బయట నుంచి వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి. సోలార్ లైట్లు ఏర్పాటు చేసినా కొద్ది రోజులకే అవి వెలగడం మానివేశాయి. తాగునీరు వచ్చే ఫిల్డర్ పాడైపోయింది. ఉన్న చిన్న ఫ్రిజ్‌కు సైతం కరెంట్ బోర్డు సరిగా లేదు. మరుగుదొడ్ల, బాత్రూమ్లకు ట్యాపులు, తలుపులు లేకపోవడంతో పాటు డ్రైనేజీ పైపులైన్ పగిలిపోయింది.
దీంతో స్నానం చేసిన నీరు, మురుగునీరు బయటకు వస్తోంది. స్నానం చేసేటప్పుడు ట్యాంకుల వద్ద సరైనా ట్యాప్‌లు లేవని, అలాగే బురద, పాకుడుతో కాళ్లు జారుతున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది కూడా ఇద్దరే ఉన్నారు. వాచ్మెన్ లేక పోవడంతో విద్యార్థులు రాత్రి సమయంలో భయపడుతున్నారు. వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు తాము ఈ హాస్టళ్లలో ఉండలేనిమని, కొత్త బిల్డింగ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
వర్షం వస్తే తిండికి తిప్పలే
హాస్టల్ భవనం పాతది కావడంతో పై కప్పు రేకులు పగిలి పైనుంచి వర్షం పడుతోంది. తినే సమయంలో వర్షం వస్తే కింద కూర్చోలేక తిప్పలు పడాల్సిందే. అన్నం ప్లేట్లలో పెట్టుకుని వర్షంలో మేము పడుకునే గదుల్లోకి వెళ్లి తినాల్సి వస్తోంది. పైనుంచి పెచ్చులూడి పతున్నాయి భయంతో పడుకోవాల్సి వస్తోంది. వంట గది సైతం కురుస్తోంది. మంచినీటి ఫిల్టర్ పాడైపోయింది. ఫ్రిజ్ చిన్నదిగా ఉండడంతో తాగు నీటికి ఇబ్బంది అవుతుంది. రాత్రి సమయంలో వాచ్మెన్ కూడా లేడు.
-గణేశ్, టెన్త్ విద్యార్థి
స్టడీ అవర్‌లో కూర్చోలేక పోతున్నాం
హాస్టల్లో మేముంటున్న గదులకు తలుపులు, కీటికిలు లేవు. దొమలు, పురుగులు వస్తున్నాయి. ఫ్యాన్ కూడా గదికి ఒక్కటి మాత్రమే ఉంది. లైట్లు లేకపోవడంతో రాత్రి సమయంలో స్టడీ అవర్‌లో కూర్చోలేక పోతున్నాం. బయటి నుంచి కరెంట్ వైర్లు దండాలుగా వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్నాయి. బాత్రూముల్లో ట్యాప్‌లు, తలుపులు సరిగా లేవు. డ్రైనేజీ పైపులకు లీకేజీ ఉండడంతో స్నానం చేసిన నీరు అక్కడే నిలిచిపోతుంది.
-లోకేష్, టెన్త్ విద్యార్థి