సూర్యాపేట, జనవరి 5(నమస్తేతెలంగాణ) : దేశం గర్వించదగిన గొప్ప మహిళ సావిత్రి బాయి పూలే అని, ఆమె దేశంలోని ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలిచారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే జయంతిని పురస్కరించుకొని తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్(టీఎంఎస్టీఏ) సూర్యాపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సావిత్రి బాయి పూలే అవార్డ్సు -2025 ప్రదానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎంపికైన ఉత్తమ మహిళా ఉపాధ్యాయురాళ్లకు అవార్డులను అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళల చైతన్యంతోనే సమాజంలో పూర్తి స్థాయి అభివృద్ధి జరుగుతుందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సావిత్రిబాయి అనేక పోరాటాలు చేశారన్నారు. మహిళలను విద్యావంతులను చేయాలని మహాత్మా జ్యోతిరావుపూలే గొప్ప ఆలోచనతో ముందుగా తన సతీమణినే చదివించి ఉపాధ్యాయురాలిని చేశాడని తెలిపారు. ఆయన మార్గంలోనే సావిత్రిబాయి ఎంతో మంది మహిళలను చైతన్యవంతుల్ని చేసిందని చెప్పారు. ఇంటిని చక్కదిద్దినట్టే, సమాజాన్ని చక్కదిద్దడంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, అటువంటి మహిళా ఉపాధ్యాయురాళ్లను సత్కరించుకోవడం గొప్ప విషయమన్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టిన టీఎంఎస్టీఏ బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. టీఎంఎస్టీఏ రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు, మాజీ ఎమ్మెల్సీ రవీందర్, వేణుగోపాల్‌రెడ్డి, చలమల్ల నర్సింహ, రాధాకృష్ణ, దామెర శ్రీనివాస్, సౌజన్య, గురుచరణ్, రవి, రమేశ్, మల్లయ్య, శ్రీను, సామ్రాజ్యలక్ష్మి, కార్తీక్, మానసవీణ తదితరులు పాల్గొన్నారు.