అనంతగిరి, జూన్ 07 : బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఎనలేని కృషి చేశారని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ తెలంగాణ డైరెక్టర్ మారగాని శంకర్ గౌడ్ అన్నారు. కోదాడ మండలంలోని ఎర్రవరం గ్రామంలో శనివారం సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. మొగలుల పాలనకు వ్యతిరేకంగా, అక్రమ శిస్తు వసూళ్లను అరికట్టాలంటూ గెరిల్లా సైన్యంతో మొగలు చక్రవర్తుల మీద పాపన్న దాడి చేశారన్నారు.
గోల్కొండ కోటను ఆక్రమించి పాలించిన ఘనుడు పాపన్న అని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు అంతా కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘ అధ్యక్షుడు పెండెం శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షుడు బెల్లంకొండ నాగేశ్వరరావు గౌడ్, మాజీ సర్పంచ్ బూర శ్రీనివాసరావు గౌడ్, పీఏసీఎస్ మాజీ ఉపాధ్యక్షుడు బెల్లంకొండ ఉపేందర్ గౌడ్, గౌడ పెద్దలు పాల్గొన్నారు.