చందంపేట (దేవరకొండ), ఆగస్టు 08 : పారిశుధ్య కార్మికులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని దేవరకొండ మున్సిపల్ కమిషనర్ సుదర్శన్ అన్నారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా దేవరకొండ మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులకు, వివిధ విభాగాల సిబ్బందికి బొడ్డుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య బృందంచే శుక్రవారం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ.. పారిశుధ్య సిబ్బంది తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, వైద్యుల సూచనలు పాటించాలన్నారు. అనంతరం కార్మికులకు బి.పి, షుగర్, హిమోగ్లోబిన్, రక్త పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయ, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్, మున్సిపల్ మేనేజర్ రాకేశ్, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ సక్రు నాయక్, మెప్మా టీఎంసీ జగమంతు, హెల్త్ అసిస్టెంట్ లింగయ్య, భవాని, కవిత, మున్సిపల్ సిబ్బంది రవికుమార్, రమాకాంత్, జవాన్ శరత్, పారిశుధ్య కార్మికులు, వైద్య సిబ్బంది, ఇతర విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.