ఆత్మకూర్.ఎస్, అక్టోబర్ 25: ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఇసుక దందా జోరుగా సాగుతోంది. మండలంలోని మక్తా కొత్తగూడెం, ఏపూరు, రామన్నగూడెం వాగుల్లో నుంచి రాత్రి పగలు అనే తేడా లేకుండా అక్రమార్కులు విచ్చలవిడిగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా ఇసుక దందా మాత్రం యథేచ్ఛగా సాగుతోంది. రాత్రి వేళల్లో కొందరు పోలీసులు పెట్రోలింగ్ పేరుతో ఆయా ప్రాంతాలకెళ్లి ముడుపులు వసూలు చేస్తూ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. నిండుగా ప్రవహిస్తున్న వాగుల్లోంచి ఇసుక తోడి బయట కుప్పలుగా పోసి ట్రాక్టర్ ఇసుకను రూ.8 వేల నుంచి రూ.10వేల వరకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఒక్కో ఇం దిరమ్మ ఇల్లుకు ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్ష ల్లో సగం డబ్బులు ఇసుక కోసమే ఖర్చు చేయాల్సి వస్తోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మక్తా కొత్తగూడెంలో వాగునుంచి ఇసుక తోడుతుండగా గ్రామస్తులు, రైతులు అడ్డుకున్నారు. అయినప్పటికీ ఇసుక దందా ఆగడం లేదని ఆరోపించారు. ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక సరఫరా చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ మండల అధికారులకు వినతిపత్రాలు ఇచ్చి, ఇసుకను బయట అధిక రేటుకు విక్రయిస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఇసుక అక్రమ రవాణాను అరికట్టి ఇందిర మ్మ ఇండ్ల నిర్మాణాలకు ఇసుక కొరత లేకుం డా చూడాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
తనిఖీ చేసిన అధికారులు
మండలంలోని వాగుల నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారంటూ పత్రికల్లో వచ్చిన వార్తలపై శనివారం అధికారులు స్పందించారు. మండలంలోని ముక్కుడుదేవులపల్లి, రామన్నగూడె గ్రామ సమీపంలోని వాగులు, వంకలు ఉన్న ప్రాంతాలను అధికారులు తనిఖీ చేశారు. ఇసుక తరలింపు ఆనవాళ్లు ఉన్నాయని, అనుమతుల్లేకుండా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఏటి వెంట ఉన్న ఇసుక వనరుల వద్ద సిబ్బంది పర్యవేక్షిస్తారని తెలిపారు. కార్యక్రమంలో హౌసిం గ్ పీడీ సిద్ధార్థ్, స్థానిక తహసీల్దార్ అమీన్సింగ్, ఎంపీడీవో హషీం, హౌసింగ్ డీఈ జబ్బార్ తదితరులు పాల్గొన్నారు.