ఆత్మకూరు, ( ఎం), మార్చి 31 : మండలంలోని కొరటికల్ గ్రామంలో ఇసుక దందా రోజురోజుకు కొత్తపుంతలు తొక్కుతోంది. తాజాగా వాగులోనే ఇసుక జల్లే నయా ట్రెండ్‌తో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. వాగు నుంచే నేరుగా సన్న ఇసుకను జల్లించి ట్రాక్టర్లలో లోడ్ చేస్తూ అక్రమ రవాణా చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. సన్న ఇసుకకు మారెట్లో భారీ డిమాండ్ ఉండటంతో, ఒక్కో ట్రాక్టర్‌కు రూ.5వేల నుంచిరూ. 6వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ అనుమతులన్నీ పకన పెట్టి వాగుల దగ్గరే ఇసుకను వడకట్టి (జల్లించి) సరఫరా చేస్తుండటం గమనార్హం.
స్థానికులు చెబుతున్నదేమిటంటే ఈ దందా అధికారుల కళ్ల ముందే జరుగుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటున్నారు. పర్యావరణ ముప్పు, భూగర్భ జలాలపై ప్రభావం తదితర సమస్యలను పట్టించుకునే వారు లేరని విమర్శిస్తున్నారు. ఇసుక మాఫియా ధైర్యంగా మమ్మల్ని ఆపేది ఎవరన్నట్టుగా వ్యవహరిస్తుండగా.. బాధ్యత వహించాల్సిన అధికారులు మాత్రం మౌనంగా ఉండటం అనుమానాలకు తావిస్తోంది. వాగుల్లోనే ఇసుక జల్లే ఈ కొత్త పద్ధతిపై తక్షణమే విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.