ధరణి అక్రమార్కులకు అవకాశమివ్వలేదు. అందుకే దాని కోరలు పీకారు. భూభారతిని తీసుకొచ్చారు. నిబంధనలను సడలించారు. ప్రజల సౌలభ్యం కోసమేనని నమ్మబలికారు. తీరాచూస్తే కబ్జాకోరుల కోసమే కన్నాలు చేశారని అర్థమైంది. అక్రమార్కులు దూరి వాటిని అగాధాలుగా మార్చారు. అంతా వ్యవస్థీకృతం! సర్కారే స్థలాలను అమ్మకానికి పెడుతున్నవేళ, ప్రభుత్వ పెద్దలే ఆక్రమణల ఆరోపణలు ఎదుర్కొంటున్నచోట.. సామాన్యుడికి సాయం దొరుకుతుందా? కంచే చేను మేస్తున్న చోట.. ఇండ్లు, పొలాలకు రక్షణ ఉంటుందా?
22ఏ సంక్షోభం నగరాన్నే కాదు, నాలుగు జిల్లాలనూ కమ్మేసింది. యజమానికి తెలియకుం డానే పట్టాలు మారిపోయాయి. దశాబ్దాలుగా ఉంటున్న కాలనీలు.. రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో చేరిపోయాయి. బ్లాక్‌లిస్టులో పెట్టిన ఆస్తులను పేదోడు అమ్ముకోలేడు, కనీసం కుదువపెట్టి అవసరార్థం అప్పు తెచ్చుకోలేడు. నిషేధిత సంకెళ్ల మధ్య సగటుజీవి నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. ఆరుగురు ఉన్నతాధికారుల వద్దకు కాళ్లరిగేలా తిరిగి, ఒప్పిస్తే కానీ తొలగని నిషేధాన్ని.. బడుగుజీవి మెడకు ఎవరు చుట్టారు? భూభారతి సమస్యలను పరిష్కరి స్తుందని, వ్యవస్థను సరళీకరిస్తుందని నమ్మబలికిన కాంగ్రెస్ నయవంచన ఇది! సామాన్యుడి కాళ్ల కింది నేలను లాగేసుకుని, లాక్ వేసుకునేందుకు 22ఏ తెచ్చి పెట్టిన పాపమెవరిది?
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరవ్యాప్తంగా లక్షల కోట్ల విలువజేసే ఆస్తులపై కాంగ్రెస్ సర్కార్ కుట్ర పన్నింది. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ అత్యంత పారదర్శకంగా, మధ్యవర్తులు, అవినీతికి ఆస్కారం లేకుండా తెచ్చిన ధరణి పోర్టల్‌ను రద్దు చేసిన రేవంత్ ప్రభుత్వం.. అక్కడి నుంచి కుట్రలకు తెరలేపింది. ధరణి కంటే సమర్థవంతమైన రెవెన్యూ విధానం అంటూ తీసుకువచ్చిన భూభారతితో సామాన్యులను నానా ఇబ్బందులు పెడుతున్నది. పాతకాలపు లొసుగులు, ధరణిలోని లోపాలను సవరించి, రాష్ట్ర పౌరులకు మెరుగైన రెవెన్యూ సేవలు అందిస్తామని చెప్పి నగరవ్యాప్తంగా ఉన్న లక్షల కోట్ల విలువ చేసే అసైన్డ్, ప్రభుత్వ భూములు, ప్రైవేట్ ఆస్తులను కూడా వివాదాల్లోకి నెట్టి నిషేధిత సంకెళ్లు వేసింది. పేద, మధ్యతరగతి జనాలతోపాటు, సంపన్నులు, విదేశీ సంస్థలు కొలువుదీరిన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, షేక్‌పేట, అమీర్‌పేట, ఖైరతాబాద్, పంజాగుట్ట వంటి ప్రైమ్ ఏరియాల్లోని భూములను నిషేధించి చోద్యం చూస్తున్నది. ఇన్నాళ్లూ తాము ఉండే ఇండ్లు, ఖాళీ జాగలపై సర్వ హక్కులను హరించేలా నిషేధిత జాబితాలో చేర్చి.. అవసరానికి అమ్ముకొనే వీల్లేకుండా చేసి జనాలను అరిగోస పెడుతున్నది. కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న తుగ్లక్ నిర్ణయాలతో గ్రేటర్ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
ధరణిని రద్దుచేసి కుట్ర అమలు
కేసీఆర్ తీసుకువచ్చిన ధరణిని రద్దు చేసి, ప్రత్యామ్నాయం పేరిట కాంగ్రెస్ సర్కార్ హైదరాబాద్ నగరంలో కుట్రలకు తెరలేపింది. ఎవరితో సంబంధం లేకుండా కేవలం భూ యజమానికి సర్వ హక్కులను కల్పించిన ధరణి వెబ్ పోర్టల్ సరైనది కాదంటూ.. భూభారతిని తెచ్చిన సర్కార్.. ఇక్కడే నిషేధిత జాబితా ఆస్ర్తాన్ని జనాలపై విసిరింది. భూభారతిని ఆసరాగా చేసుకొని ప్రభుత్వ, వక్ఫ్, యూఎల్సీ భూములను చెరబట్టింది. ఈ చర్యలతో పేద, మధ్యతరగతి ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండాపోయి గుండెలు బాదుకునే పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్క గ్రేటర్ పరిధిలోనే వేలాది ఎకరాల భూములు, దశాబ్దాలుగా తమ ఆధీనంలో ఉన్న ఆస్తులపై హక్కులను కాలరాసింది.
భూభారతి మోసాల పుట్ట
ధరణి విధ్వంసం వెనుక కాంగ్రెస్ సర్కార్ వేసిన కుట్ర ప్రతిఫలమే భూభారతి అనేలా పరిస్థితులు మారిపోయాయి. అధికారంలోకి రావడంతోనే రెవెన్యూ, రియల్ ఎస్టేట్ రంగానికి కీలకమైన హైదరాబాద్ నగర భూములపై కన్నేసిన కాంగ్రెస్ గద్దలు.. ధరణి ఆధునికీకరణ పేరిట భూభారతికి జీవం పోసింది. ఇక్కడే రెవెన్యూ రికార్డులను లోపాలు బయటపడకుండా.. రెవెన్యూ దస్ర్తాల ప్రక్షాళనకు కాంగ్రెస్ సర్కార్ గుట్టుగా తెరలేపిందనే అనుమానాలున్నాయి. దీనికి మోసాల పుట్టగా మారిన భూభారతిని ఆయుధంగా మార్చుకొని జనాలను ఇబ్బందులు పెడుతున్నది. ధరణిలో భూములకు సర్వహక్కులను కల్పించడం వల్ల ప్రైవేట్ ఆస్తులను కాజేయడం సాధ్యపడలేదు. ఈ క్రమంలోనే భూభారతిని తీసుకువచ్చి.. కలెక్టర్లు, అధికారుల వద్ద ఉన్న అధికారాలను, అప్పిలేట్ అథారిటీలను మళ్లీ పాతకాలపు రెవెన్యూ వివాదాల్లోకి నెట్టి.. జనాలపై 22-ఏ జాబితాను ప్రయోగించింది. పేద, మధ్యతరగతి, సంపన్న వర్గాలు అనే తేడా లేకుండా, వ్యవసాయ, వ్యవసాయేతర భూములనే తేడా లేకుండా, చివరికి హెచ్ఎండీఏ, హుడా, జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న లే అవుట్లలోని ప్లాట్లు, ఇండ్లను కూడా నిషేధించి నిర్బంధించింది. ఇక్కడే గందరగోళానికి తెరలేపిన కాంగ్రెస్ సర్కార్.. తెరవెనుక వేల కోట్ల భూములను మాయం చేసే కుట్రలను పకడ్బందీగా అమలు చేస్తున్నది. కాంగ్రెస్ తీసుకువచ్చిన ఈ మోసపూరిత భూభారతి విధానం సామాన్యుడి కష్టార్జితాన్ని హరిస్తున్నది.
కాంగ్రెస్ కోరల్లో పేదల ఆస్తులు
ప్రభుత్వ తుగ్లక్ నిర్ణయాలకు అద్దం పట్టే నిషేధిత జాబితాతో లక్షలాది మంది సామాన్య, మధ్యతరగతి ప్రజల ఆస్తుల భవితవ్యం అంధకారంలోకి వెళ్లింది. వారతస్వంగా, దశాబ్దాల కష్టార్జితాన్ని, పన్నులు చెల్లించి కాపాడుకున్న ఆస్తులను రాత్రికి రాత్రే 22-ఏ జాబితాలో చేర్చడంతో సామాన్యుడు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. తన కూతురు పెళ్లి కోసమని, 60 ఏండ్ల వృద్ధురాలు తాను నివాసముండే ఇంటిని అమ్ముకోలేక, నిషేధిత జాబితా కోరల నుంచి బయటపడలేక ఆందోళనతో కుంగిపోయే పరిస్థితి వచ్చింది. చివరికి సొంత ఆస్తులపై హక్కులే లేకుండా చేసిన సర్కార్.. కనీసం బ్యాంకుల నుంచి కూడా అప్పులు పుట్టలేని స్థాయికి తీసుకువచ్చి జనాలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా నిషేధిత జాబితాలో ఉన్న భూముల్లో 40-50 శాతం భూములన్నీ గ్రేటర్ పరిధిలో ఉండగా వీటన్నింటి విలువ లక్షల కోట్లు విలువ చేస్తుంది.
పొంగులేటి క్షమాపణ బూటకమే
ప్రైవేట్ ఆస్తులను ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చడంపై రాష్ట్రవ్యాప్తంగా వెల్లువెత్తిన ప్రజాందోళనతో కాంగ్రెస్ ప్రభుత్వం తర్జనభర్జన పడుతున్నది. దాదాపు 6 నెలలుగా సాగుతున్న ఈ వ్యవహారంపై ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలను ప్రచురించింది. ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యకు పరిష్కారం చూపకుండా ఈ వ్యవహారంపై స్పందించిన రెవెన్యూ శాఖ మంత్రి క్షమాపణ పేరిట మరో బూటకానికి తెరలేపారు. ఇక్కడే అధికారుల తప్పిదంతో పొరపాటున ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులు కూడా నిషేధిత జాబితాలో పడ్డాయంటూ సన్నాయి నొక్కులతో కలరింగ్ ఇచ్చారు. కానీ అసలు కుట్ర ఇక్కడే దాగి ఉన్నదనీ, ప్రభుత్వ ప్రమేయం లేకుండా అధికారులు నిర్ణయం ఎలా తీసుకుంటారని ఓ రిటైర్డ్ అధికారి వ్యాఖ్యానించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి వరకు వేలాది ఫిర్యాదులను పరిష్కరించలేని సర్కార్.. ఇప్పుడు 15 రోజుల్లోనే పరిష్కరిస్తామని చెప్పి మభ్యపెడుతున్నది.