– సూర్యాపేట ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొమ్మిడి అశోక్ ఆరోపణ
సూర్యాపేట, జూలై 15 : ఆర్యవైశ్య సంఘంలో పదవులను డబ్బులకు విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొమ్మిడి అశోక్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రం వాణిజ్య భవన్ సెంటర్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష ఎన్నికల్లో బెలిదే శ్రీనివాస్ గెలుపు కోసం తన వ్యక్తిగత పనులను పక్కనపెట్టి ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేశానని తెలిపారు. ఎన్నికల అనంతరం తనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని కోరగా, ఆ పదవికి పోటీ ఎక్కువగా ఉండటంతో ఎవరికి ఇవ్వకుండా పూర్తిగా రద్దు చేస్తున్నట్లు తెలిపారన్నారు. సంఘానికి చెడ్డపేరు రాకూడదనే ఉద్దేశంతో తాను కూడా ఆ నిర్ణయాన్ని అంగీకరించానన్నారు.
అయితే అనంతరం నిర్వహించిన సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్, పీఆర్వో పదవులను కమిటీ నుంచి తొలగిస్తున్నట్లు అందరి సమక్షంలో ప్రకటించినప్పటికీ, తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని రాచర్ల కమలాకర్‌కు రూ.10 లక్షలకు కేటాయించారని ఆరోపించారు.ఈ వ్యవహారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకుని ఆ పదవిని పూర్తిగా రద్దు చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. అవసరమైతే ఈ నెల 19న జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా అడ్డుకుంటామని తెలిపారు. అలాగే ఈ విషయాన్ని జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఫిర్యాదు చేసి తగిన చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సోమ సుమన్, వీరవెల్లి విజయ్, బజ్జూరి శ్రీనివాస్, గజ్జల నరేష్, ఇమ్మడి సందీప్, షీలా శంకర్, బొమ్మిడి సంతోష్ పాల్గొన్నారు.