కట్టంగూర్, సెప్టెంబర్ 22 : తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రైవేట్ మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కట్టంగూర్ మండలంలోని ఇస్మాయిల్ పల్లి గ్రామానికి చెందిన పెంజర్ల సైదులు ఎన్నికయ్యారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రాష్ట్ర మహాసభలో సైదులును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోటార్ ట్రాన్స్పోర్ట్ రంగంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మహాలక్ష్మి పథకంతో జీవనభృతి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ప్రకటించిన రూ.12 వేలు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, గుర్తింపు కార్డులు అందజేయాలన్నారు. తన నియమకానికి సహకరించిన రాష్ట్ర, జిల్లా నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.