నల్లగొండ, ఆగస్టు 3 : నాగార్జునసాగర్ ఎడమ కాల్వ నీటితో జిల్లాలోని చెరువులు నింపాలని ప్రభుత్వం నిర్ణయించినందున రైతులు ఆ నీటిని సాగు అవసరాలకు మళ్లించొద్దని కలెక్టర్ నారాయణరెడ్డి కోరారు. శనివారం కలెక్టరేట్ నుంచి వివిధ శాఖల అధికారులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఎడమ కాల్వకు రోజూ పది వేల నుంచి పదకొండు వేల క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నట్లు తెలిపిన కలెక్టర్.. ఆ నీటితో జిల్లాలోని చెరువులను మాత్రమే నింపనున్నట్లు తెలిపారు.
ఈ మేరకు గ్రామపంచాయతీ కార్యదర్శులు ఎప్పటికప్పుడు పర్యక్షిస్తుండాలని ఆదేశించారు. ఎక్కడైనా చెరువు కట్టలు తెగే ప్రమాదం ఉంటే వెంటనే పైఅధికారులకు సమాచారం అందించాన్నారు. ఇంజినీరింగ్ అధికారులు అప్రమత్తంగా ఉండి లష్కర్లను కాల్వల వెంట తిప్పి నీటి దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. ఈ కార్యాచరణ అమలుకు జిల్లావ్యాప్తంగా ఉన్న తహసీల్దార్లు, ఎంపీడీఓలు, సబ్ ఇన్స్పెక్టర్లు పూర్తిస్థాయిలో సహకరించాలని ఆదేశించారు. త్వరలో పంటల సాగుకు సైతం నీటిని విడుదల ఉంటుందని, ప్రస్తుతం వదిలిన నీటిని చెరువుల మాత్రమే వదలామని స్పష్టం చేశారు.