నీలగిరి, మే18 : నల్లగొండ జిల్లాలో నకిలీ వైద్యులుగా చలామణి అవుతున్న 11మందిపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. పలు మెడికల్ షాపుల పేరుతో క్లినిక్ నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో గత సంవత్సరం రెండు దఫాలుగా జిల్లాలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. జిల్లాలో పలు అసుపత్రుల్లో కంపౌండర్లుగా పనిచేసి టీఎస్‌ఎంపీఆర్ నిబంధనలకు విరుద్ధంగా డాక్టర్ల వేషధారణతో వైద్యం చేస్తున్నట్లు, ఆర్ఎంపీలు, పీఎంపీలు కొంతమంది మెడికల్ దుకాణాల పేరుతో లైసెన్స్‌లు తీసుకుని తమ అర్హతకు మించి శస్త్ర చికిత్సలకు వినియోగించే పలు రకాల అనుమతులు లేని మందులు వాడుతున్నట్లు గుర్తించారు.
దాంతో వారు నిర్వహిస్తున్న క్లినిక్‌లను సీజ్ చేసి విచారణ చేపట్టారు. తాజాగా వారు చేస్తున్నది అక్రమమే అని తేలడంతో సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఫిర్యాదు చేయడంతో నల్లగొండ వన్ టౌన్ పరిధిలో మూడు, టూటౌన్ పరిధిలో నాలుగు, మునుగోడులో రెండు, తిప్పర్తిలో ఐదు ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు, క్లినిక్‌లపై కేసులు నమోదు చేశారు.