నల్లగొండ సిటీ ఆగస్టు 11: రాఖీ పండుగ పేరిట ప్రత్యే క సర్వీసుల పేరుతో ఆర్టీసీ ప్రయాణికులను నిలువునా దోపిడీ చేసింది. పండుగ ముగిసినా తిరుగు ప్రయాణం లో కూడా ప్రత్యేక బస్సుల పేరిట టికెట్ ధరలు బారీగా పెంచి ఆర్డీనరీ బస్సులకు స్పెషల్ బస్సుల బోర్డులు తగిలించి ప్రయాణికుల నుంచి ముక్కు పిండి అదనపు చార్జీలను వసూలు చేస్తుంది. స్పెషల్ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణాన్ని అనుమతించపోవడంతో మహిళలు డబ్బులు చెల్లించి టికెట్ తీసుకొని ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
30నుంచి 40శాతం మేర అదనపు చార్జీలు
ఉచిత బస్సులను తగ్గించి స్పెషల్ బస్సుల పేరిట ప్రయాణికుల నుంచి 30 నుంచి 40శాతం వరకు అదనపు చార్జీలను వసూలు చేస్తున్నారు. ఇదేఅదనుగా భావించిన ఆర్టీసీ పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులను నడపకుండా 2 లేదా 3గంటలకు ఒక్క బస్సును నడుపుతుండడంతో ప్రయాణికులు బస్టాండ్‌లో గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. చివరకు చేసేది ఏమీ లేక స్పెషల్ బస్సులో ప్రయాణించి టికెట్ కొనుగోలు చేసి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
ప్రయాణికుల గంటల తరబడి నిరీక్షణ
బస్టాండ్లలో బస్సులు లేక ప్రయాణికుల గంటల తరబడి నిరీక్షించారు. మూడు రోజులు వరుస సెలవులు రావడంతో రాఖీ పండుగకు పెద్ద ఎత్తున మహిళలు సొంత గ్రామాలకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో సోమవారం గమ్యస్థానాలకు చేరుకునేందుకు ప్రయాణికులు పెద్దఎత్తున బస్టాండ్‌లో టికెట్ కోసం కిలోమీటర్ల మేర లైన్లో బారులుదీరారు. ప్రయాణికుల తగిన విధంగా బస్సులు లేకపోవడంతో కొంత మంది ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది.
ఆర్డీనరీ బస్‌లో ఎక్స్‌ప్రెస్ చార్జీలు
ఆర్టీసీ నిబంధనల ప్రకారం ఎక్స్‌ప్రెస్ బస్సులు ఎక్స్ప్రెస్లాగా..ఆర్డీనరీ బస్సులు ఆర్డీనరీ లాగా డీలక్స్ బస్సులు డీలక్స్లాగా నడవాలి. కానీ బస్సుల రూపురేఖలు మార్చి ఆర్టీసీ దోపిడీకి పాల్పడుతుంది. ఎక్స్‌ప్రెస్‌లను సూపర్లగ్జరీలుగా, ఆర్డీనరీ బస్సులను స్పెషల్ బస్సులాగా చేసి ప్రయాణికులను నిండా ముంచుతుంది.