సూర్యాపేట, జూలై 2 (నమస్తే తెలంగాణ) ; ఉమ్మడి జిల్లాలోని అనేక గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడువడం లేదు. బస్సెరుగని ఊర్లు ఎన్నో ఉన్నాయి. ఆర్టీసీ బస్సులు రాకపోవడంతో జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు బడికి వెళ్లేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఆదాయం వచ్చే మార్గాలపైనే ఆర్టీసీ దృష్టి పెట్టడంతో పల్లెలకు బస్సులు రావడం లేదు. విద్యార్థులు పాఠశాలకు వెళ్లే సమయానికి బస్సులు వేయాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం ఉండడంలేదు. చేసేదేం లేక విద్యార్థులు నడుచుకుంటూనో, సైకిళ్లపైనో, ఇతర వాహనాలను లిఫ్ట్ అడిగో వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.
50 శాతం గ్రామాలకు బస్సులు పోతలేవ్..
సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట, కోదాడ డిపోలు ఉన్నాయి. వీటిల్లో 125 బస్సులు ఉండగా ప్రస్తుతం 118 బస్సులు నడుస్తున్నాయి. వాస్తవానికి ఒక్క బస్సు తగ్గినా ఆ బస్సు తిరిగే రూట్లు దాదాపు 10 నుంచి 15 గ్రామాలు ఉంటాయి. జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీలు, ఆవాసాలు కలిపి 1,335 ఉండగా దాదాపు 50 నుంచి 55 శాతం పల్లెలకు ఆర్టీసీ బస్సు సౌకర్యమే లేదు. గతేడాదితో పోల్చకుంటే ఈ ఏడాది గ్రామాలకు పల్లె వెలుగు బస్సులు మరిన్ని తగ్గాయి. ఆయా గ్రామాలకు సరైన రోడ్డు సదుపాయం ఉన్నప్పటికీ బస్సులు మాత్రం రాకపోవడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ ఆదాయంపైనే దృష్టి పెడుతున్నదని, పల్లెలకు బస్సులు నడుపాలనే ఆలోచన చేయడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక కొత్త బస్సుల కేటాయింపు లేనేలేదు. ఉన్న పరిమిత బస్సుల్లో మహా లక్షి పథకం వచ్చాక 98శాతం ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతుండటంతో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. నల్లగొండ జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది.
రెండున్నర కిలోమీటర్లు నడువాల్సిందే..
త్రిపురారం మండలంలోని కంపసాగర్ మోడల్ స్కూల్లో చదువుకోవాలంటే మండల కేంద్రం నుంచి రెండున్నర కిలోమీటర్లు నడవాల్సిందే. బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ఆటోలో లేక నడుచుకుంటూ రావాల్సి వస్తున్నది. ఒక్కో విద్యార్థి ఆటో ప్రయాణ ఖర్చులు ప్రతి నెలా రూ.800 నుంచి రూ.1000 చెల్లిస్తున్నారు. ఇంతకుముందు రాగడప గ్రామం నుంచి మండల వ్యాప్తంగా తిరుగుతూ ప్రత్యేకమైన బస్సు సౌకర్యం ఉండేది. కానీ ఆ బస్సు సౌకర్యం తీసివేశారు. అలాగే మండలంలోని చెన్నాయిపాలెం జడ్పీ హైస్కూల్‌కు వెళ్లాలంటే మాటూరు, వస్రాంతండా, సత్యంపాడుతండా, లావూడితండా గ్రామాలకు చెందిన విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
3 నుంచి 10 కిలోమీటర్లు ఇబ్బందే..
జిల్లాలోని చాలా గ్రామాల్లోని ప్రాథమిక స్థాయి వరకు బడులు కొనసాగుతున్నాయి. దీంతో హైస్కూల్ కోసం 3 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇతర గ్రామాలకు వెళ్లాల్సిన పరిస్థితి. ఇక పెద్ద సంఖ్యలో విద్యార్థులు మండల కేంద్రాల్లోని ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. బస్సులు రాని గ్రామాల నుంచి వారంతా నడుచుకుంటూనో.. సైకిళ్లపైనో వెళ్తున్నారు. మండల కేంద్రాలకు వెళ్లే విద్యార్థులు ఆటోలపై ఆధారపడుతున్నారు. ఆటోల్లో ప్రయాణం ఒక్కోసారి ప్రాణాల మీదికి తెస్తున్నా తప్పనిసరి పరిస్థితుల్లో ఆశ్రయించాల్సి వస్తున్నది. కొన్ని గ్రామాల్లో ఉదయం, సాయంత్ర వేళల్లో బస్సులు నడుస్తున్నా సకాలంలో రాకపోవడంతో ఇతర వాహనాలను ఆశ్రయించాల్సి వస్తున్నది. ఇలాంటి సమయంలో అమ్మాయిలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. పాఠశాల వెళ్లే సమయంలో, తిరిగి వచ్చే సమయంలో సాయంత్రం ఆకతాయిలు వికృత చేష్టలకు దిగుతుండటంతో ఇబ్బందులు పడుతున్నారు.
బస్సుల కోసం ఎదురుచూపు
శాలిగౌరారం : మండలంలో పాఠశాల సమయానికి బస్సులు రాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వచ్చినా సీట్లు ఉండడం లేదు. వల్లాల గ్రామంలో గల మోడల్ స్కూల్లో 800మంది విద్యార్థులు చదువుతున్నారు. వివిధ గ్రామాల నుంచి విద్యార్థులు వస్తుండగా బస్సులు లేక ఆటోల్లో రావాల్సి వస్తున్నది.
ఆటో ఎక్కాల్సిందే..
తుంగతుర్తి : సమయానికి బస్సులు లేక పసునూరు మోడల్ స్కూల్ వెళ్లడానికి అన్నారం గ్రామానికి చెందిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం ఏడున్నర వరకే తయారై ప్రతి రోజూ రూ.20 నుంచి 30 వెచ్చించి ఆటో ద్వారా తుంగతుర్తికి చేరుకుంటున్నారు. ఆ తర్వాత తుంగతుర్తి నుంచి 9గంటలకు మాత్రమే వెళ్లే హైదరాబాద్ బస్సు ఎక్కి పసునూరు మోడల్ సూకల్ పాఠశాలకు చేరుకుంటున్నారు.
పట్టించుకోని అధికారులు
గ్రామాలకు బస్సులు రాకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల అసలే బస్సు నడువకపోవడంపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులపై ఒత్తిడి పెరుగుతున్నది. విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు వినతిపత్రాలు అందిస్తున్నారు. కొన్ని చోట్ల రోడ్లపై ధర్నాలు, ఆందోళనలు చేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయినా ఎవరూ పట్టించుకోవడంలేదు.