నిడమనూరు, ఏప్రిల్ 18 : ధర్మారపు మల్లీశ్వరిది ఆత్మహత్య కాదని, ఇది ముమ్మాటికీ కుల వివక్ష హత్యేనని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. మండలంలోని బొక్కమంతలపాడు గ్రామానికి చెందిన ధర్మారపు మల్లీశ్వరి తల్లిదండ్రులను నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్తో కలిసి శుక్రవారం పరామర్శించారు. మల్లీశ్వరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వారు విలేకర్లతో మాట్లాడుతూ సంఘటన జరిగి ఐదురోజులు అవుతున్నా పోలీసులు ఇంతవరకూ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. మల్లీశ్వరిపై వేధింపులు, కుల వివక్ష కారణంగానే తీరని అన్యాయం జరిగిందన్నారు. ప్రేమపేరుతో మల్లీశ్వరిని మోసగించిన నిందితుడు కుక్కల జాన్‌రెడ్డిని అరెస్ట్ చేసి మిగతా నిందితులను అరెస్ట్ చేయకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు.
నియోజకవర్గానికి చెందిన ఎంపీ రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి దళిత యువతి కుటుంబాన్ని పరామర్శించకపోవడం శోచనీయమన్నారు. మల్లీశ్వరిని వేధించి ఆత్మహత్యకు ప్రేరేపించిన 12 మంది నిందితులపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట మాజీ మార్కెట్ చైర్మన్ కామర్ల జానయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తాటి సత్యపాల్, నాయకులు బొల్లం రవి యాదవ్, మెరుగు రామలింగయ్య, సురబి రాంబాబు, ఆదిమల్ల భాస్కర్, తదితరులు ఉన్నారు.