మిర్యాలగూడ, ఏప్రిల్ 8 : రైస్ మిల్లుల వద్దకు వచ్చే రైతుల ధాన్యానికి మద్దతు ధర ఇచ్చే విధంగా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని, బుధవారం నుంచి ఆయా మిల్లుల వద్ద విధులు నిర్వహించాలని సబ్ కలెక్టర్ నారాయణ్అమిత్ ఆదేశాలు జారీచేశారు.
రైతుల ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని, మిల్లర్లు సిండికేట్గా మారారని నమస్తే తెలంగాణలో కథనాలు ప్రచురితం కావడంతో కలెక్టర్ ఇలా త్రిపాఠితోపాటు ఉన్నతాధికారులు స్పందించారు.
వారి ఆదేశంతో మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో నేటి నుంచి సన్న ధాన్యం కొనుగోలు చేస్తున్న మిల్లుల వద్ద రెవెన్యూ అధికారులు పర్యవేక్షించనున్నారు. ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు మిల్లుల వద్ద ధాన్యానికి మద్దతు ధర ఇచ్చేలా, ట్రాక్టర్లలో ధాన్యం వెంటనే దిగుమతి అయ్యేలా చర్యలు తీసుకోనున్నారు.