సూర్యాపేట టౌన్, మార్చి 14 : కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక డైవర్షన్ రాజకీయాలకు పాల్పడడం దారుణమని పెన్‌పహాడ్ మాజీ ఎంపీపీ నెమ్మాది భిక్షం, సూర్యాపేట మాజీ జడ్పీటీసీ జీడి భిక్షం అన్నారు. ప్రజల పక్షాన పోరాడే మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి దళిత స్పీకర్‌ను అవమానించారని అబద్ధపు ప్రచారంతో అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని దళితులుగా తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. దళిత స్పీకర్‌ను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ రాజకీయాలు చేయడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని భయపెడితే ఇంకెవరు ప్రశ్నించరనుకోవడం ప్రభుత్వ అవివేకమన్నారు.
14 ఏండ్లు ఉద్యమం చేసి తెలంగాణను సాధించి దేశానికి రోల్ మోడల్ చేసిన కేసీఆర్‌ను అవమానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవర్తనను ప్రజలు గమనిస్తున్నారని, సరైన గుణపాఠం చెబుతారన్నారు. కాలేశ్వరం నీళ్లు తెచ్చి రైతులకు ఇవ్వడంతో పాటు 24 గంటల ఉచిత కరెంట్ అందజేసి పదేళ్ల పాటు వ్యవసాయాన్ని సస్యశ్యామల చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిలదే అని కొనియాడారు. మండలంలోని చివరి గ్రామాలకు చెందిన రైతుల పంట పొలాలు నీళ్లు లేక ఎండిపోవడాన్ని జగదీశ్‌రెడ్డి పరిశీలించి అదే విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించినట్లు తెలిపారు. ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రశ్నిస్తే స్పీకర్‌ను అవమానించాడని అబద్ధపు ప్రచారం చేస్తున్నారన్నారు. గతంలో ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రిగా జగదీశ్ రెడ్డి దళితుల అభ్యున్నతికి పాటుపడ్డారన్నారు. ఎంతోమంది దళిత నాయకులను ప్రజా ప్రతినిధులుగా చేసినట్లు తెలిపారు. సూర్యాపేట మున్సిపల్ జనరల్ స్థానంలో దళిత మహిళను మున్సిపల్ చైర్పర్సన్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ఓ జనరల్ స్థానంలో దళిత మహిళను పెట్టే దమ్ము మీకుందా అని ప్రశ్నించారు.
దళితుల ఆత్మగౌరవానికి చిహ్నంగా హైదరాబాద్‌లో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని చూసేందుకు వెళ్లకుండా తాళం వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. జగదీశ్‌రెడ్డి స్పీకర్ ను అవమానించలేదని.. స్పీకర్ కుటుంబానికి పెద్ద అని అటువంటి వ్యక్తి బాధ్యతగా వ్యవహరించాలని అన్నారే తప్పా అవమానించలేదన్నారు. పదేపదే దళిత స్పీకర్‌ను అవమానించారని కాంగ్రెస్ మంత్రులు పేర్కొంటూ స్పీకర్ ను మరింత అవమానిస్తున్నారన్నారు. పదేండ్లు మంత్రిగా పనిచేసిన జగదీశ్‌రెడ్డికి సభా మర్యాదలు తెలుసని, సమస్యలపై ప్రశ్నిస్తే దాన్ని వక్రీకరించి దుష్ప్రచారం చేయడం తగదన్నారు. దళిత యువకులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు చేయూతనిచ్చిన జగదీశ్‌రెడ్డి దళితులకు వ్యతిరేకం అనడం సిగ్గుచేటు అన్నారు.
దళితుల మనోభావాలను మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి నిజంగా దెబ్బతీసి ఉంటే తాము ఈ సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడేవారం కాదన్నారు. దళితుల ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తి జగదీశ్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం జగదీశ్ రెడ్డికి క్షమాపణలు చెప్పి చేతనైతే ప్రజా సమస్యలపై చర్చకు వచ్చి మంచి పాలన అందించాలని హితవు పలికారు. ఈ సమావేశంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ బొల్లె జానయ్య, జిల్లా నాయకులు వల్దాస్ జానీ (జే), బత్తుల ప్రసాద్, ఉపేందర్, మాజీ సర్పంచులు సుధాకర్, నెమ్మాది నగేశ్, బొడ్డు వినోద్, మల్లేశ్, నెమ్మది వీరబాబు, మంద కమలాకర్, తిరుమలేశ్, కనుక రేణుక, శ్రీను, సూరారపు జానయ్య, అనుమలపురి జానయ్య, నెమ్మది కృష్ణ, నర్ర పరమేశ్, కోడి రవి పాల్గొన్నారు.