రైతు రుణమాఫీ అంతుచిక్కని ప్రశ్నగా మారింది. మొన్నటి వరకూ అదిగో వస్తుంది.. ఇదిగో వస్తుంది అని కాలం నెట్టుకొచ్చిన సర్కారు మూడో విడుతలోనూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చాలామంది రైతులకు మొండిచెయ్యి చూపింది. దాంతో ఈసారైనా మాఫీ అవుతుందని ఆశపడ్డ అన్నదాతలకు నిరాశే ఎదురైంది. ఎందుకు మాఫీ కాలేదో కారణం కూడా తెలియకపోవడంతో బాధితులు బ్యాంకులు, వ్యవసాధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు.
ఎట్టకేలకు జాబితా విడుదల..
రాష్ట్ర ప్రభుత్వం మూడు విడుతల్లో రుణమాఫీ చేసింది. ఇప్పటికే రెండు విడుతలు పూర్తికాగా, పంద్రాగస్టు రోజు నుంచి మూడో విడుత అమలు చేస్తున్నది. మూడో విడుత జాబితాను మాత్రం విడుదల చేయలేదు. దాంతో ఎవరికి మాఫీ అయ్యింది.. ఎవరికి కాలేదు అనేదానిపై స్పష్టత లేక రైతులు ఆందోళన చెందారు. ఎట్టకేలకు శుక్రవారం రాత్రి తర్వాత లబ్ధిదారుల జాబితా విడుదలైంది. వాస్తవంగా.. అనేకమంది అర్హులైనా మొదటి, రెండు విడుతల్లో పేర్లు రాలేదు. మొదటి విడుత సమయంలో అధికారులను సంప్రదిస్తే రెండో విడుతలో వస్తుందన్నారు. రెండో విడుతలో అడిగితే మూడో విడుత అని దాటువేస్తూ వచ్చారు. ఇప్పుడు తాజా జాబితాలోనూ పేర్లు లేకపోవడంతో అనేక మంది రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు..
మూడో విడుత జాబితా రావడంతో లబ్ధిదారులు తమ పేర్లను చెక్ చేసుకుంటున్నారు. ఇందులోనూ పేర్లు లేకపోవడంతో బ్యాంక్‌లు, వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు రైతులు నాలుగైదు సార్లు కూడా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ వివరాలాను తెలుసుకుంటున్నారు. ఇప్పటి దాకా రెండో, విడుతలో వస్తాయని చెప్పి తప్పించుకున్న అధికారులు.. ఇప్పుడు మాత్రం తామేం చేయలేమని చేతులెత్తేస్తున్నారు.
వాళ్లు ఆశలు వదులుకోవాల్సిందేనా?
క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలిస్తే.. ముఖ్యంగా ఇంట్లో రేషన్ కార్డు లేనివాళ్లకు, రెండు లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకున్నవాళ్లకు మాఫీ కాలేదని తెలుస్తున్నది. రేషన్ కార్డుతో సంబంధం లేదని సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రకటించినా, ఆచరణలో మాత్రం అమలు కాలేదు. అంతేగాక ఒకే ఇంట్లో భార్య రూ.1.50లక్షలు, భర్త లక్ష రుణం తీసుకుంటే మొత్తం రూ. 2.50 లక్షలు అవుతుండటంతో వారికి మాఫీ వర్తింపజేయలేదు. అలాంటి వాళ్ల పరిస్థితి ఏంటి? రుణమాఫీ వస్తుందా, రాదా! ఆశలు వదులకోవాల్సిందేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కనీసం ఇంట్లో ఎవరికో ఒకరికైనా మాఫీ చేయకపోవడంపై కడుపు మండిన లబ్ధిదారులు సర్కారును దుమ్మెత్తి పోస్తున్నారు.
కొత్తపల్లి సహకార సంఘంలో సగం మందికే రుణమాఫీ
హాలియా, ఆగస్టు 17 : అనుముల మండలం కొత్తపల్లి సహకార సంఘంలో మొత్తం 1,326 మంది రైతులు రుణమాఫీకి అర్హులు కాగా.. ఇప్పటి వరకు 643 మందికే మాఫీ అయ్యింది. కొత్తపల్లి పీఏసీఎస్‌లో మొదటి విడుతలో 373మంది రైతులకు, రెండో విడుతలో 170, మూడో విడుతలో వంద మంది రైతులకు రుణమాఫీ అయినట్లు మెసేజ్‌లు వచ్చాయి. కొత్తపల్లి సహకార సంఘానికి రూ.7.5 కోట్లు రుణమాఫీ కింద రావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు రూ.3,13,75,000 మాత్రమే సొసైటీ ఖాతాల్లో జమ అయ్యాయి. దీంతో రుణమాఫీ కాని రైతులు తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.
రుణమాఫీ అనేది ఒక బూటకం
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని, రైతులంతా బ్యాంకుల్లో రుణాలు తెచ్చుకోవాలని రేవంత్‌రెడ్డి ఆ రోజు చెప్పిండు. ముఖ్యమంత్రి అయినంక రుణమాఫీకి సవాలక్ష కొర్రీలు పెడుతుండు. నాకు, నా భార్యకు కలిపి స్టేట్ బ్యాంకులో రూ.3లక్షల క్రాప్ లోన్ ఉంది. ఇచ్చిన హామీ ప్రకారం మాకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తే ఆనందించేవాళ్లం. కానీ.. రూ.2లక్షలకు పైగా ఉన్న డబ్బులు కట్టుకోవాలి, గ్రీవెన్స్‌డేలో దరఖాస్తు చేసుకోవాలని లింకులు పెడుతున్నారు. దరఖాస్తు చేసుకుంటే మళ్లీ ఆన్లైన్ చేసి ప్రభుత్వానికి పంపిస్తే రుణమాఫీ వస్తుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు దాటింది. ఇంకా మాయమాటలు చెబుతున్నారు. చాలామంది రైతులకు రుణమాఫీ కాలేదు. సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రైతులందరికీ రుణమాఫీ చేయాల్సిందే. మాట తప్పితే రైతులంతా తగిన విధంగా గుణపాఠం చెప్తారు.
– పాశం యాదగిరిరెడ్డి, రైతు, దొండవారిగూడెం, మిర్యాలగూడ మండలం
రుణమాఫీ పేరుతో ప్రభుత్వం రైతులను వంచించింది
హాలియా యూనియన్ బ్యాంకులో నాకు రూ.లక్షా 60వేల లోన్ ఉంది. కానీ.. నా పేరు ఏ జాబితాలోనూ లేదు. రుణమాఫీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రైతులను వంచించింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్లో రైతులందరికీ రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు సాకులు వెతుకుతున్నారు. లక్ష రూపాయలు ఒకసారి, లక్షన్నర ఒకసారి, రెండు లక్షలు ఒకసారి మాఫీ చేస్తున్నామని పేర్కొన్నారు. పూర్తిస్థాయి రుణమాఫీ మాత్రం చేయడం లేదు.
– ఉడ్తూరి శ్రీనివాస్‌రెడ్డి, రైతు, కొత్తపల్లి, అనుముల మండలం
నయా పైసా మాఫీ కాలేదు..
గత ఎన్నికల్లో అది చేస్తాం.. ఇది చేస్తామని అబద్ధాలు చెప్పి రైతులతో ఓట్లు వేయించుకున్నారు. గెలిచిన తరువాత కాం గ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదు. రుణమాఫీ అన్నారు కానీ.. అది ఎవరికి వచ్చిందో, ఎవరికి రాలేదో అర్థం కావట్లేదు. నేను రూ.1.60లక్షల పంట రుణం తీసుకున్నా. రుణమాఫీ చేస్తామంటే ఆ డబ్బులు వ్యవసాయానికి అక్కరకు వస్తాయనుకున్నాం. కానీ.. నయా పైసా కూడా మాఫీ కాలే. ఇంతవరకూ రైతు భరోసా డబ్బులు కూడా వేయలేదు. సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలతో ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్నారు. రైతులందరూ ఏకమై ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు.
– మునగాల అంజిరెడ్డి, రైతు, కుక్కడం, మాడ్గులపల్లి మండలం