– ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిరిగిరి రామకృష్ణారెడ్డి
– నల్లగొండ కలెక్టరేట్ ఎదుట రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా
రామగిరి, మార్చి 31 : తెలంగాణలో మార్చి 2024 తర్వాత రిటైర్డ్ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు అందాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, దీంతో ఎంతో మంది అవస్థలు పడుతున్నారని తక్షణమే వాటిని విడుదల చేయాలని కోరుతూ మంగళవారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిరిగిరి రామకృష్ణారెడ్డి, ఉద్యోగులు డా.రావిరాల అంజయ్య, చిటిప్రోలు సదానందం మాట్లాడుతూ.. ఇప్పటికే పలు విధాలుగా నిరసనలు చేశామని, అసెంబ్లీ ముట్టడి చేశామని, మంత్రులు, ఎమ్మెల్యేలను, అధికారులను కలిసి తమ సమస్య మోరపెట్టుకున్నా ఎలాంటి చలనం లేదని అవేదన వ్యక్తం చేశారు.
ఉద్యోగి తన పదవీకాలంలో దాచుకున్న డబ్బులను సహితం ఇవ్వకుండా ఇంతా నిర్లక్ష్యం చేస్తుండడంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉండటంతో పాటు మానోవేదన పడుతున్నట్లు తెలిపారు. హైకోర్టు తమ సమస్యలను ఏప్రిల్ 09లోగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించిందని తమకు అందాల్సి పూర్తి బెనిఫిట్స్‌ను ఏకమొత్తంలో అందచేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్‌ను కలిసి వినతి పత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులు మల్లిఖార్జున్, కరీం, వెంకటరెడ్డి పాల్గొన్నారు.