చిలుకూరు, జులై 02 : పోలీస్ స్టేషన్లలో ప్రజలు ఇచ్చే ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. బుధవారం చిలుకూరు పోలీస్ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డైరీ, రిసెప్షన్ రిజిస్టర్‌ను తనిఖీ చేసి మండల వ్యాప్తంగా నమోదు అవుతున్న కేసుల వివరాలను ఎస్ఐ రాంబాబు గౌడ్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలని సూచించారు. రహదారి భద్రతను ప్రజలకు వివరించాలన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండి ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. పిల్లలకు వాహనాలు ఇవ్వొదని, వ్యవసాయ పనుల వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచించారు.