న్యాయం చేయాలంటూ మున్సిపల్ కార్యాలయం ఎదుట బాధితుల ధర్నా
భువనగిరి అర్బన్ మే 27 : ఎలాంటి ముందుస్తు సమాచారం ఇవ్వకుండా అధికారులు భువనగిరి పట్టణంలోని ప్రధాన రహదారి విస్తరణ పనులు చేపడుతున్నారంటూ బాధితులు, అఖిలపక్ష నాయకులు పేర్కొన్నారు. రహదారి విస్తరణతో ఇండ్లు కోల్పోయి తాము వీధిన పడే పరిస్థితి ఉందని బాధితులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు తమకు న్యాయం చేయాలంటూ బుధవారం భువనగిరి మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మా ట్లాడుతూ భువనగిరి రహదారిని 30 ఫీట్ల నుంచి 40 ఫీట్ల వరకు విస్తరించాల్సి ఉండగా ఒకేసారి 100 ఫీట్ల విస్తరణ పనులు చేపట్టడంతో రహదారిపై ఉన్న ఇండ్లు కోల్పోయి వీధిన పడే పరిస్థితి వచ్చిందన్నారు.
గతంలో పనులు చేపట్టే ముందు నోటీసులు ఇచ్చిన అనంతరం విస్తరణ పనులు చేపట్టారని, కానీ స్థానిక ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా జేసీబీలతో వచ్చి విస్తరణ పనులు చేపట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ సందర్భంగా బాధితులు పెద్ద యెత్తున నినాదాలు చేస్తూ మున్సిపల్ కార్యాలయం లో ధర్నా నిర్వహించారు. ధర్నా నిర్వహిస్తున్న బాధితులను కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు పోలీసుల సాయంతో అడ్డుకొని మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లారు. బాధితులకు న్యాయం చేయకుండా కమిటీ నిర్వహించి రోడ్డు విస్తరణ పనులు చేపడితే నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని, తమకు న్యాయం చేసిన తర్వాతనే విస్తరణ పనులు చేపట్టాలని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఏవీ కిరణ్ కుమార్, బీఆర్ఎస్ కౌన్సిలర్లు, బాధితులు పెద్దఎత్తున పాల్గొన్నారు.