కోదాడ, జూలై 30 : వర్షాకాలం వస్తుందంటే ఆ కాలనీ ప్రజలు భయాందోళనకు గురవుతుంటారు. విస్తారంగా వర్షాలు కురిస్తే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. లోతట్టు ప్రాంతం కావడంతో కాలనీలోకి వరద నీరు చేరుతుంది. దీంతో ఎప్పుడు ఇళ్లల్లోకి నీళ్లు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొన్నదని కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని శిరిడి సాయి కాలనీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలనీ అధ్యక్షుడు మట్టపల్లి నాగేశ్వరరావు, కార్యదర్శి నజీర్, ఉపాధ్యక్షుడు హరినాథ్ బుధవారం మాట్లాడుతూ.. గత ఏడాది ఆగస్టు నెలలో వచ్చిన వరదలకు పట్టణంలోని ఖమ్మం రోడ్డు లోని తమ కాలనీ పూర్తిగా మునిగిపోయిందన్నారు. అయినప్పటికీ మున్సిపల్ అధికారులు ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడం పట్ల వారు అసహన వ్యక్తం చేశారు.
మళ్లీ వరదలు వస్తే ముంపునకు గురవుతామని ఆవేదన వ్యక్తం చేశారు. కోదాడ పెద్ద చెరువులోని గుర్రపు డెక్క తమ్మర వాగు బ్రిడ్జి దగ్గర ఆగడంతో జేసీబీ సహాయంతో గుర్రపు డెక్కను అక్కడ నుంచి అధికారులు తొలగించారని, తొలగించిన గుర్రపు డెక్కను షిరిడి సాయి కాలనీలో గల వాగులో పడేయడంతో నీళ్లు నిలిచాయని, గత మూడు రోజుల క్రితం కురిసిన వర్షానికి కాలనీలోకి వర్షపు నీరు రావడంతో ప్రజలు భయాందోళనకు గురైనట్లు తెలిపారు. కాలనీలో 150 ఇండ్లు ఉన్నాయని, కాలనీ పరిస్థితిని పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తక్షణమే సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.