యాదాద్రి భువనగిరి జిల్లా రైతులు తమ భూములను కాపాడుకునేందుకు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. జిల్లాలో ఓ వైపు ట్రిపుల్ ఆర్ బాధితులు వెనకడుగు వేయకుండా పోరు సల్పుతున్నారు. మరోవైపు గౌరెల్లి-భద్రాచలం జాతీయ రహదారి కోసం ప్రభుత్వానికి భూములు ఇచ్చేది లేదంటూ ఉద్యమ బాట పడుతున్నారు. సర్కారు మాత్రం రైతుల డిమాండ్లు పట్టించుకోకుండా భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేస్తున్నది.
– యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ)
ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టును ఉత్తర, దక్షిణ భాగాలుగా విభజించారు. ఉత్తర భాగంలో జిల్లా మీదుగా 59.33 కిలోమీటర్ల మేర రోడ్డును నిర్మించనున్నారు. దీని పరిధిలో తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్ మండలాలు ఉన్నాయి. రహదారి నిర్మాణం కోసం సుమారు 2వేల ఎకరాల భూమిని సేకరించనున్నారు. భువనగిరి మండలంలోని గౌస్‌నగర్, కేసారం, యెర్రంబెల్లి, తుక్కాపూర్, పెంచికల్‌పహాడ్, రాయగిరి గ్రామాల్లో భూమిని తీసుకోనున్నారు. ముఖ్యం గా రాయగిరి రైతులు తమ భూములను కోల్పోతున్నారు. ఇప్పటికే ఈ ప్రాంత రైతులు పలు సందర్భాల్లో తమ భూములను కోల్పోవాల్సి వచ్చింది. వైటీడీఏ విస్తరణ, హైటెన్షన్ వైర్లు, జాతీయ రహదారి నిర్మాణం సమయంలో భూములను ప్రభుత్వానికి అప్పగించాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఇక్కడి నుంచే ట్రిపుల్ ఆర్ రోడ్డు వెళ్తుండడంతో మిగిలిన కొద్దిపాటి భూమిని కూడా సర్కారు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ నేపథ్యంలో ఈసారి భూములు ఇచ్చేది లేదని రాయగిరి రైతులు నాలుగేండ్లుగా రణం చేస్తున్నారు. హైకోర్టును కూడా ఆశ్రయించారు. కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నా ఆ తర్వాత స్టే వెకెట్ అయ్యింది.
చౌటుప్పల్ పట్టణానికి ఆనుకుని తూర్పు వైపున హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపైన రీజినల్ రింగ్ రోడ్డులో ఉత్తర, దక్షిణ భాగాలు కలిపే జంక్షన్‌ను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ క్రమంలో చౌటుప్పల్ వద్ద తలపెట్టిన జంక్షన్ విస్తరణను భారీగా పెంచింది. కొత్త అలైన్మెంట్తో చౌటుప్పల్ పట్టణం రెండుగా చీలనున్నది. రెండున్నర రెట్లు అధికంగా రైతుల భూములను కోల్పోవల్సి వస్తున్నది. ఏండ్ల తరబడి వ్యవసాయమే అధారంగా జీవిస్తున్న రైతులు రీజినల్ రింగ్ రోడ్డుకు తమ భూములు తీసుకుంటే రోడ్డున పడుతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలైన్మెంట్ మార్చాలని, లేదా బహిరంగ మార్కెట్లో ఉన్న ధరను అనుసరించి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే భూమికి బదులు భూమి ఇవ్వాలని పట్టుపడుతున్నారు.
ప్రభుత్వానికి భూములు ఇచ్చేది లేదని రైతులు భీష్మించి కూర్చున్నారు. ఆ మేరకు నిత్యం ఆందోళనలు చేస్తున్నారు. సమావేశాలు, రౌండ్ టేబుల్ మీటింగ్, చర్చ గోష్టిలు నిర్వహిస్తున్నారు. భువనగిరి, చౌటుప్పల్ మండలాలు భూ నిర్వాసితులు గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరినీ కలుస్తున్నారు. అధికారులు, అధికారం, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను కలుస్తూ తమ గోడు వెల్లబోసుకుటున్నారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఇదే సమయంలో ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా చౌటుప్పల్‌లో సర్వే కోసం వచ్చిన అధికారులను అడ్డుకున్నారు. ఇటీవల గౌరెల్లి – భద్రాచలం హైవే నిర్వాసితులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి వినతిపత్రం అందించారు. భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా గౌరెల్లి నుంచి భద్రాది కొత్తగూడెం వరకు జాతీయ రహదారి 930 నిర్మిస్తున్నారు. భూదాన్‌పోచంపల్లి, వలిగొండ, మోత్కూర్, అడ్డగూడూరు మీదుగా సూర్యాపేట జిల్లా తిరుమలగిరి, మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ నుంచి భద్రాది కొత్తగూడెం వరకు జాతీయ రహదారి వేయనున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని చౌటుప్పల్ డివిజన్ పరిధిలో గల వలిగొండ, భూదాన్ పోచంపల్లి మండలాల్లో భూ సేకరణ చేయనున్నారు. జిల్లాలో సుమారు 42 కిలోమీటర్ల మేర కొత్త రోడ్డును నిర్మించనున్నారు. ఇప్పటికే అధికారులు నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. రైతుల నుంచి వినతులు, అభ్యంతరాలు స్వీకరించారు.
వేలాది మంది రైతులు ఉద్యమ బాట పడుతుంటే.. ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. భూ నిర్వాసితుల గోడును పెడ చెవిన పెడుతున్నది. ట్రిపుల్ ఆర్‌లో భాగంగా ఇప్పటికే ట్రీడీ, త్రీజీ నోటిఫికేషన్లు విడుదల చేసింది. రాయగిరి రైతులు కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకోగా విశ్వ ప్రయత్నాలు చేసి వెకెట్ చేయించేలా చర్యలు తీసుకున్నది. అవసరమైతే కొంతమేర పరిహారం పెంచే పనిలో ఉన్నట్టు తెలుస్తున్నది. జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సైతం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్ వేగవంతానికి చర్యలు తీసుకోవాలని కోరిన విషయం తెలిసిందే.
మా దగ్గర ఇప్పటికే నాలుగైదు సార్లు భూములను కోల్పోయాం. కోట్ల రూపాయల విలువ చేసే భూములను అప్పనంగా ఎలా ఇస్తాం? ఎన్నికల సమయంలో ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మారుస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇప్పుడు అదే ప్రభుత్వం భూములను గుంజుకునే ప్రయత్నం చేస్తున్నది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఏకంగా భూ సేకరణ పూర్తయ్యిందని కేంద్రానికి అబద్దాలు చెప్తున్నారు. ప్రాణాలు పోయినా మా భూములు ఇవ్వం.
– పాండు, ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితుడు, రాయగిరి
మాకు వ్యవసాయమే జీవనాధారం. తాతల నుంచి భూమిని నమ్ముకుని బతుకుతున్నాం. నాకున్న నాలుగెకరాలు ట్రిబుల్ ఆర్ జంక్షన్ అలైన్మెంట్లో పోతున్నది. ఏ మాత్రమూ మిగలడం లేదు. భూమి మొత్తం పోతే ఎట్లా బతకాలి. ఇంతకు ముందు అధికారులు ఆధార్‌కార్డు, పాస్‌బుక్ అడిగితే ఇవ్వలేదు. సర్వే కూడా చెయ్యనివ్వలేదు. బహిరంగ మార్కెట్లో ఉన్న ధర ఇస్తే భూమి ఇస్తాం. లేదంటే భూమికి బదులు భూమి ఇవ్వాలి.
-జాల జంగయ్య యాదవ్, రైతు, చౌటుప్పల్
ప్రభుత్వం గౌరెల్లి నుంచి భద్రాచలం మీదుగా చత్తీస్గడ్ వరకు నిర్మిస్తున్న హైవేలో భూములు కోల్పోతున్న రైతులకు మార్కెట్ ధర ప్రకారం పరిహారం చెల్లించాలి. ఆ తర్వాతే భూముల జోలికి రావాలి. భూమితోనే మాకు బతుదెరువు. ఉన్న భూమి కాస్త రోడ్డు కోసమని ప్రభుత్వం తీసుకుంటే మేమెట్లా బతుకాలి. నామమాత్రం ధర చెల్లించి భూములను గుంజుకుంటామంటే ఊరుకునేదే లేదు. న్యాయమైన ధర కోసం సమైక్యంగా పోరాటం చేస్తాం. అన్యాయంగా భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తే ప్రజా తిరుగుబాటు తప్పదు.
– భీమనబోయిన జంగయ్య, సంగెం గ్రామం (వలిగొండ మండలం)