రీజనల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్)పై నిర్వాసితులు అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. త్రీజీ నోటిఫికేషన్ విడుదలైనా వెనుకడుగు వేయకుండా ఉద్యమం ఉధృతంగా కొనసాగిస్తున్నారు. నాడు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖం చాటేయడంపై మండిపడుతున్నారు. అవార్డు ఎంక్వైరీ విచారణకు ఒక్క రైతు కూడా హాజరు కాకుండా తమ ఐక్యతను చాటుకున్నారు. రాయగిరి రైతులు మరోసారి హైకోర్టు ఆశ్రయించి న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు.
ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టును ఉత్తర, దక్షిణ భాగాలుగా విభజించారు. ఉత్తర భాగంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా మీదుగా 59.33 కిలోమీటర్ల మేర రోడ్డును నిర్మించనున్నారు. దీని పరిధిలో తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్ మండలాలు ఉన్నాయి. 34 గ్రామాల మీదుగా రహదారి వేయనున్నారు. రాయగిరి, చౌటుప్పల్ వద్ద ఇంటర్ ఛేంజ్ జంక్షన్లు నిర్మించనున్నారు. 1,927 వేల ఎకరాల భూమిని సేకరించనున్నారు. మరో 188 ఎకరాల కోసం చౌటుప్పల్ వద్ద జంక్షన్ కోసం రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు.
భూ సేకరణకు ఉత్తర భాగంలో ఏర్పాటు చేసిన 8 కాలా(కాంపిటెంట్ అథారిటీ ఫర్ ల్యాండ్ ఆక్విజేషన్)లో అన్నింటిలోనూ త్రీజీ నోటిఫికేషన్ విడుదలయ్యాయి. ముఖ్యంగా ఇటీవల చౌటుప్పల్, వలిగొండ, భువనగిరి మండలాల్లోని గ్రామాలకు త్రీజీ నోటిఫికేషన్ విడుదల చేశారు. అందులో భాగంగా తాసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల్లో గ్రామాల వారీగా అవార్డు ఎంక్వైరీ కోసం సమావేశాలు ఏర్పాటు చేయగా, ఎక్కడా భూ నిర్వాసితులు అధికారులకు సహకరించ లేదు. సమావేశాలను అడ్డుకుని, రెవెన్యూ కార్యాలయాల ఎదుట ఆందోళన చేపట్టారు. మూడు రోజులుగా చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయంలో ట్రిపుల్ ఆర్ బాధితులు సమావేశాలను బహిష్కరించి, ధర్నా చేస్తున్నారు. శుక్రవారం భువనగిరి పట్టణంలోనూ ఆర్డీఓ కార్యాలయంలో అవార్డు ఎంక్వైరీకి ఒక్క రైతు కూడా హాజరు కాలేదు. నిర్వాసితుల కోసం ఏర్పాట్లు చేసి, ఎంతోసేపు ఎదురు చూసినా ఫలితం లేకుండా పోయింది. ఏ ఒక్కరూ అధికారులకు వివరాలను సమర్పించ లేదు. ఈ నెల 30 వరకు సమావేశాలను బహిష్కరిస్తామని అన్ని గ్రామాల రైతులు స్పష్టం చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని, లేదా నిర్వాసితులకు భూమికి బదులుగా భూమి ఇవ్వాలని, కానిపక్షంలో బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
ట్రిపుల్ ఆర్కు భూములు ఇచ్చేది లేదని మొదటి నుంచి రాయగిరి రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే నాలుగైదు సార్లు తమ విలువైన భూములను కోల్పోయామని, ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వబోమని భీష్మించారు. ఇక్కడి రైతులు యాదగిరిగుట్ట విస్తరణ, హైటెన్షన్ వైర్లు, గ్యాస్ పైప్‌లైన్, జాతీయ రహదారి నిర్మాణం సమయంలో విలువైన భూములను కోల్పోయారు. ఇప్పుడు కొద్దిపాటి భూమికి కూడా ట్రిపుల్ ఆర్ రూపంలో ముప్పు వచ్చి పడింది. దీనికి వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళనలు చేశారు. 32 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేశారు. దాంతో రాయగిరి భూ సేకరణపై స్టే విధించింది. సీఎం రేవంత్ రెడ్డి ట్రిపుల్ ఆర్ పనులు వేగవంతం చేయాలని ఆదేశించండంతో జిల్లా ఉన్నతాధికారులతోపాటు ఎన్హెచ్ఏఐ అధికారులు కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. అనంతరం వాదనలు విన్న సింగిల్ బెంచ్ జడ్జి ఈ నెల మొదటి వారంలో స్టేను కొట్టేశారు. దాంతో రైతులు మరోసారి డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. విచారణలో ఉన్నట్లు తెలుస్తున్నది.
ఓ వైపు అధికారులు భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేస్తున్నా రైతులు మాత్రం పోరాటాలను వీడడం లేదు. ఎప్పటికప్పుడు ఉద్యమ కార్యాచరణ కొనసాగిస్తూనే ఉన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్‌తోపాటు అనేక మంది నేతలను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇంటి ఎదుట పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ఉదయాన్నే వందలాది మంది అక్కడికి చేరకుని మంత్రిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. తనకేమీ తెలియదని, అంతా సీఎం రేవంత్‌రెడ్డి చూసుకుంటున్నారని మంత్రి చేతులెత్తేశారని రైతులు మండిపడుతున్నారు. ఆ తర్వాత మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని కలిసి తమ గోసను వినిపించారు. స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పట్టించుకోవడం లేదని రైతులను ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ తమను నమ్మించి నట్టేట ముంచిందని ట్రిపుల్ ఆర్ బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాయగిరి రైతులను ఎన్నికల్లో మోసం చేశారని మండిపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మారుస్తాని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆ పార్టీ అగ్రనేత ప్రియాంకాగాంధీతోపాటు అప్పటి ఎంపీ, ప్రస్తుతం ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. రాయగిరి రైతుల ఉద్యమాలకు మద్దతుగా నిలిచే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ట్రిపుల్ ఆర్ రైతులను అస్సలు పట్టించుకోకుండా మొహం చాటేస్తున్నారు.