నీలగిరి, ఏప్రిల్ 01 : కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దుచేసి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ నల్లగొండ జిల్లా కార్యదర్శి ఎండీ సలీం, ఉపాధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్య, సహాయ కార్యదర్శి అవుట రవీందర్ డిమాండ్ చేశారు. బుధవారం కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు సీఐటీయూ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలో మున్సిపల్ హాజరు పాయింట్ల దగ్గర, హమాలీ, పవర్లూమ్, భవన నిర్మాణ రంగ కార్మికుల పని ప్రదేశాలలో పలుచోట్ల 4 లేబర్ కోడ్ల అమలును నిరసిస్తూ బ్లాక్ డే, నిరసనలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మిక చట్టాలను రద్దుచేసి 4 లేబర్ కోడ్ లు తెచ్చిందని ఆరోపించారు. వాటిని వెంటనే రద్దుచేసి పాత చట్టాలను యధాతధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కేరళ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ ను అమలు చేయమని అసెంబ్లీలో తీర్మానం చేసిందని అదే తరహాలో తెలంగాణలో రాష్ట్రంలో కూడ అమలు చేయమని అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సవరణ బిల్లు-2022ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడంలో కార్మిక వర్గం అంతా ఐక్యంగా సిద్ధపడి ఉన్నారని హెచ్చరించారు. పట్టణంలో పలుచోట్ల జరిగిన నిరసన కార్యక్రమంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు గంజి నాగరాజు, హమాలి యూనియన్ కార్యదర్శి బొమ్మకంటి లక్ష్మీపతి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పట్టణ కార్యదర్శి పెరిక కృష్ణ, పందుల లింగయ్య, జీడిమెట్ల నరసింహ, దర్శనం ఎల్లమ్మ, నాగుల కరుణ, వీరబాబు, అంజయ్య, ముషంగిరి వెంకన్నపాల్గొన్నారు.