నల్లగొండ విద్యా విభాగం (రామగిరి), జూన్ 02 : దేశ భవిష్యత్ తరగతి గదుల్లో నిర్మిస్తున్న ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షుడు డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య అన్నారు. నల్లగొండకు చెందిన ఉపాధ్యాయుడు, ప్రముఖ యోగా గురువు మాదగాని శంకరయ్య ఉద్యోగ విరమణ అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మాదగాని శంకరయ్య సామాజిక స్పృహతో, అంకితభావంతో జీవితమంతా మంచి విలువలతో అందరికీ మార్గదర్శకంగా నిలిచారన్నారు.
తేజస్విని సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్షుడు పెందోట సోము మాట్లాడుతూ.. మాదగాని శంకరయ్య దాతృత్వం ఎంతోమంది పేద విద్యార్థులకు మేలు చేకూర్చిందన్నారు. సిలువేరు సాహితీ కళాపీఠం అధ్యక్షుడు సిలువేరు లింగమూర్తి మాట్లాడుతూ.. తెలుగు, సంస్కృత భాషల్లో పండితుడైన శంకరయ్య సేవలు ఇకముందు కూడా విద్యారంగానికి ఎంతో అవసరం అన్నారు. పెరుమాళ్ల ఆనంద్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో రచయితలు శీలం భద్రయ్య, డాక్టర్ సాగర్ల సత్తయ్య, డాక్టర్ కనకటి రామకృష్ణ, దాసోజు శ్రీనివాస్ పాల్గొన్నారు.