యాదగిరిగుట్ట, డిసెంబర్ 12 : యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహ స్వామి సన్నిధిలో స్వామి, అమ్మవార్ల నిత్యారాధనలు మంగళవారం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పి తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామి వారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించారు. ప్రధానాలయ మొదటి ప్రాకార మండపంలో సుదర్శ నారసింహ హోమం నిర్వహించిన అనంతరం స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా ముస్తాబు చేసి గజవాహనంపై వెలుపలి ప్రాకార మండపంలో ఊరేగించారు. అనంతరం లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా నిత్య తిరు కల్యాణ తంతు జరిపించారు. కల్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వీక్షించారు. ప్రధానాలయ ముఖ మండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా భక్తులకు సువర్ణ పుష్పార్చనలు చేశారు. బంగారు పుష్పాలతో దేవేరులను అర్చించారు. సాయంత్రం వేళలో స్వామి వారికి తిరువీధి, దర్భార్ సేవ ఘనంగా నిర్వహించారు. పాతగుట్టలో స్వామివారికి నిత్యారాధనలు ఘనంగా నిర్వహించారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ. 27,73,072 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి తెలిపారు.
కార్తీక వన భోజనాలు
దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక వన భోజనం కమనీయంగా సాగింది. మల్లాపురం గ్రామ పరిధిలోని ఆలయ తోటలో మొదటగా గణపతి పూజ, స్వస్తివాచనం, ఆదిత్యాది నవగ్రరాధన, మండపారాధన, సత్యనారాయణ స్వామి పూజ, తులసీదాత్రి సమేత కార్తీక దామోదర స్వామి కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించి తీర్థప్రసాద వితరణ గావించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి వనభోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
గుట్టలో కార్తీకమాస రాబడి రూ.14.91కోట్లు
యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహ స్వామికి కార్తీక మాసం సందర్భంగా 29రోజులకు గాను రూ.14,91,10,031 ఆదాయం సమకూరిందని ఆలయాధికారులు తెలిపారు. గతేడాది(2022) 23రోజులకు గాను రూ.14,66,43,048 ఆదాయం సమకూరగా ఈసారి 29రోజులకు గాను మొత్తం ఆదాయంలో రూ.24,66,983 ఆదాయం పెరిగిందని తెలిపారు. ఉమ్మడి తెలుగు రాష్ర్టాల్లో అన్నవరం అనంతరం అత్యధికంగా జరిగే సత్యనారాయణ స్వామి వ్రతాలు ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సల్పంగా తగ్గిందని, మొత్తం 18,824 మంది భక్తులు వ్రతాల్లో పాల్గొనగా రూ. 1,64,20,600 ఆదాయం వచ్చిందని తెలిపారు. గతేడాది 21,480మంది దంపతులు వ్రతాల్లో పాల్గొనగా స్వామివారికి రూ. 1,71,84,000 ఆదాయం వచ్చిందని తెలిపారు.