చిట్యాల, ఆగస్టు 24 : నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని వెల్మినేడు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న హిండిస్ ల్యాబ్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో బుధవారం సాయంత్రం రియాక్టర్ పేలడంతో ఆరుగురు కార్మికులు గాయపడ్డారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు, కంపెనీ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. హిండిస్ కెమికల్ ఫ్యాక్టరీలో బుధవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో డీ బ్లాక్ వద్ద ఉన్న రియాక్టర్లో ఒత్తిడి పెరిగి ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. దాంతో కంపెనీ నుంచి దట్టమైన పొగలు వెలువడ్డాయి. ఆ సమయంలో డీ బ్లాక్‌లో పనిచేస్తున్న కార్మికులు వై.లక్ష్మారెడ్డి, బాల్దేవ్, శుభమ్, రాజ్‌కుమార్, వహీద్, మోహన్‌కు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం నార్కట్‌పల్లి సమీపంలో ఉన్న కామినేని ఆస్పత్రికి తరలించారు. అందులో ఆంధ్రప్రదేశ్‌లోని కడపకు చెందిన వై.లక్ష్మారెడ్డి, ఉత్తరప్రదేశ్‌కు చెందిన బాల్దేవ్, శుభమ్ల పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. పేలుడు ధాటికి డి బ్లాక్ భవనం పూర్తిగా ధ్వంసమైంది. బ్లాక్ పరిసర ప్రాంతాల్లో రసాయనం ప్రవహించి విష వాయువు వ్యాపించింది. ఒకేసారి భారీ విస్పోటనంతో పేలుడు సంభవించి దట్టమైన పొగలు రావటంతో చుట్టు పక్కల గ్రామాలవారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
ఎస్పీ సందర్శన
సంఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి, ఆర్డీఓ జగన్నాథరావు సందర్శించారు. చిట్యాల సీఐ శివరాంరెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ ధర్మ కంపెనీ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. తాసీల్దార్ కృష్ణారెడ్డి సంఘటనా స్థలం వద్దే ఉండి పరిస్థితిని పర్యవేక్షించారు.
కంపెనీ ఎదుట ఆందోళన
కంపెనీలో పనిచేసే కార్మికులు, సిబ్బంది కుటుంబ సభ్యులతోపాటు ప్రజలు, నాయకులు ఆందోళనకు గురై కంపెనీ వద్దకు చేరుకున్నారు. వారంతా కంపెనీ గేటు వద్ద ఆందోళనకు దిగారు. కంపెనీని వెంటనే మూసి వేయాలని, ప్రమాదానికి గురైన కార్మికులకు నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ నాయకులు కొలను వెంకటేశ్ ఆధ్వర్యంలో కంపెనీ లోపల ధర్నాకు దిగారు. వెల్మినేడు సర్పంచ్ మల్లమ్మ, ఎంపీటీసీ దేవరపల్లి సత్తిరెడ్డి, వివిధ పార్టీల నాయకులు గుడిపాటి లక్ష్మీనర్సింహ, జడల చినమల్లయ్య, మేడి ప్రియదర్శిని, నూనె వెంకటస్వామి, జిట్ట నగేశ్, నారబోయిన శ్రీనివాసులు పాల్గొన్నారు.