కోదాడ, జూలై 29 : అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేస్తామని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. కోదాడ పట్టణంలోని స్థానిక ఆర్ ఎస్ వి ఫంక్షన్ హాల్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన పైలెట్ ప్రాజెక్టు గా ఎంపికైన గుడిబండ గ్రామంలోని లబ్ధిదారులకు నూతనరేషన్ కార్డులు పంపిణీ చేశారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జిల్లాలో అర్హులైన పేదవారికి ఆహార భద్రత కల్పించి ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేయడం ప్రభుత్వ లక్ష్యం అన్నారు.
ప్రజా పాలన, మీ సేవ కేంద్రాల్లో వచ్చిన దరఖాస్తులను విచారణ జరిపి అర్హులైన వారిని కొత్త రేషన్ కార్డులకు ఎంపిక చేశామన్నారు. ఆర్డీఓ సూర్యనారాయణ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో తాసీల్దార్ వాజిద్ అలీ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, కాంగ్రెస్ కోదాడ మండలాధ్యక్షుడు తుమాటి వరప్రసాద్ రెడ్డి, ఉపాధ్యక్షుడు ఇర్ల సీతారాంరెడ్డి, కోదాడ మాజీ ఎంపీపీ మల్లెల రాణి బ్రహ్మయ్య, ఎర్రవరం పీఏసీఎస్ చైర్మన్ నలజాల శ్రీనివాసరావు, కోదాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరావు, కాంగ్రెస్ నాయకులు మందలపు శేషు, చిమిరాల పీఏసీఎస్ చైర్మన్ కొత్త రఘు పాల్గొన్నారు.