Trade Deal : భారత్‌పై విధించిన సుంకాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తగ్గించారు. ఈ మేరకు టారిఫ్‌లు తగ్గిస్తూ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయబోమని ఇండియా హామీ ఇచ్చిన నేపథ్యంలో టారిఫ్‌ల తగ్గింపు నిర్ణయాన్ని అమెరికా అమలు చేస్తోంది. రష్యా నుంచి నేరుగా కానీ, లేదా పరోక్షంగా కానీ చమురు కొనబోమని ఇండియా హామీ ఇచ్చిందని ట్రంప్ ప్రకటించాడు.
ఇటీవలి కాలంలో ఇండియా.. రష్యా నుంచి చమురు కొనుగోలు తగ్గించినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు అమెరికా నుంచి చమురు సహా ఎనర్జీ సంబంధిత ఉత్పత్తులు కొనుగోలు చేస్తామని కూడా ఇండియా హామీ ఇచ్చింది. కొత్త టారిఫ్‌లు అమలులోకి రావడంతో ఇకపై ఇరు దేశాల మధ్య ఉత్పత్తులపై 18 శాతం మత్రమే పన్నులు ఉంటాయి. ఇది దేశీయ ఎగుమతి దారులకు, తయారీదారులకు మేలు చేస్తుందని భారత్ భావిస్తోంది. అమెరికా నుంచి ఇండియా 500 బిలియన్ డాలర్ల ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకోనుంది. అలాగే భారత ఎగుమతిదారులకు 30 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ అందుబాటులోకి వస్తుంది. ఇది చరిత్రాత్మక విజయం అని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. మరోవైపు తాజాగా ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందం అమలులోకి రావడంపై ప్రధాని మోదీ స్పందించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇది ఇరు దేశాలకు మంచి శుభవార్త అని, రెండు దేశాల మధ్య బలమైన సంబంధాల కోసం వ్యక్తిగత నిబద్ధతతో కృషి చేసిన ట్రంప్‌నకు థాంక్స్ అని మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ డీల్ ఇండియాలోని రైతులు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్‌లు, మత్స్యకారులకు కొత్త అవకాశాల్ని సృష్టిస్తుందని అభిప్రాయపడ్డారు. మేకిన్ ఇండియా లక్ష్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని, మహిళలు, యువతకు భారీ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మోదీ అభివర్ణించారు.