పెన్పహాడ్, ఫిబ్రవరి 20: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ కాకతీయ పథకం ద్వారా పూడికలు తీసి చెరువులను కాళేశ్వరం జలాలతో నింపి సస్యశ్యామలం చేశారు. గత కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యంతో ఏడారిగా మారిన ప్రాంతాలు తొలి సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యల కారణంగా నేడు చెరువుల నిండా నీళ్లు చేరడంతో సముద్రాల్లో కనిపించే నీటి కుక్కలు ఇక్కడి చెరువుల్లో ప్రత్యక్షమవుతున్నాయి. ధర్మాపురం గ్రామంలోని మధిరామక్క చెరువులో శుక్రవార ఉదయం గ్రామస్తులకు నీటి కుక్క కనిపించింది.
సముద్రాల్లో కనిపించే నీటి కుక్క కనిపించడంతో దాన్ని చూడటానికి చెరువు దగ్గరకు పరుగులు తీశారు. వింతగా కనపించిన ఈ జంతువును యువకులు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అక్కడికి చేరిన జనాలను చూసిన నీటి కుక్క నెమ్మదిగా నీటిలోకి జారుకుంది. చెరువులోకి నీటి కుక్క ఎలా వచ్చిందని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ నీటి కుక్కను ప్రత్యక్షంగా చూశామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది.