నల్లగొండ, జులై 10 : అరుదైన జబ్బుతో బాధపడుతున్న మహిళకు ప్రపంచ స్థాయి శస్త్ర చికిత్స చేసి ప్రాణాలు కాపాడినట్లు హైదరాబాద్ మలక్‌పేట యశోద హాస్పిటల్ వైద్యులు డాక్టర్ రంజిత్ కుమార్, డాక్టర్ రంగ సంతోష్ కుమార్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని మనోరమ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. చిట్యాల మండల కేంద్రానికి చెందిన గౌరు అరుణ కుడి భుజానికి తీవ్రమైన నొప్పి, వాపుతో బాధపడుతూ యశోద మలక్‌పేటకు వచ్చిందన్నారు. పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆమె రెహమటటైడ్ ఆర్రిస్టిస్ (రక్తనాళాలకు సంబందించిన) వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించినట్లు తెలిపారు.
కుడి భుజంలో ఉన్న రక్తనాళాలు చిట్లిపోయి రక్తస్రావమై నొప్పి తీవ్రంగా ఉండడంతో వెంటనే సర్జరీ చేసి చిట్లిపోయిన రక్త నాళం వద్ద స్టంట్ ఏర్పాటు చేసి తిరిగి రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చేసి ప్రాణాలు కాపాడినట్లు వెల్లడించారు. కనీస అవగాహన లేకపోవడంతో కొన్నిసార్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు ప్రాణాలు కోల్పోతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో హాస్పిటల్ డైరెక్టర్ గోరుకంటి పవన్, యూనిట్ హెడ్ శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్, ఏనుగు వాసుకిరణ్ రెడ్డి పాల్గొన్నారు.