రామగిరి, సెప్టెంబర్ 26 : బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడగా అవమానం భరించలేక బాధితురాలు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనలో దోషికి న్యాయస్థానం రెండు జీవిత ఖైదులు, అలాగే రూ.65 వేల జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది. నారాయణపురం మండలం సర్వేల్ గ్రామానికి చెందిన కట్టెల సైదులు పదో తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అవమానం భరించలేక మైనర్ కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై 13-06-2019న చిట్యాల పోలీస్ స్టేషన్లో నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దర్యాప్తు అనంతరం కోర్టులో ఛార్జ్ సీట్ దాఖలు చేయగా విచారణ అనంతరం ఎస్సీ, ఎస్టీ అండ్ పోక్సో కోర్టు వ్యక్తిని దోషిగా నిర్ధారిస్తూ తీర్పు వెల్లడించింది.
ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, సీఐలు నరేందర్, శంకర్ రెడ్డి, ఎస్ఐ రాములు, ప్రాసిక్యూషన్కు సహకరించిన కె.శివరాం రెడ్డి, నల్లగొండ డీఎస్పీ, నార్కట్పల్లి సీఐ నాగరాజు, చిట్యాల ఎస్ఐ రవికుమార్, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వేముల రంజిత్ కుమార్, సీడీఓ యాదయ్య, బరోసా సెంటర్ లీగల్ ఆఫీసర్ కె.కల్పన, లైజన్ అధికారులు పి.నరేందర్, ఎన్.మల్లికార్జున్ ను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.