నల్లగొండ, ఆగస్టు 26 : నల్లగొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఓ బాలికపై జరిగిన అత్యాచారం కేసులో దోషిగా తేలిన వ్యక్తికి 51 ఏండ్ల జైలు శిక్ష, రూ.85 వేల జరిమానా విధించింది. కేసు వివరాలు.. 3 నవంబర్, 2021న తిప్పర్తి మండలానికి చెందిన బాలిక బస్టాప్ వద్ద వేచి ఉండగా షేక్ ఖయ్యూం అనే వ్యక్తి బైక్పై వచ్చి ఆమెను బలవంతంగా బండి ఎక్కించుకున్నాడు. ఓ పాడుపడ్డ ఇంట్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు తిప్పర్తి పోలీస్ స్టేషన్లో నిందితుడిపై ఐదు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యయి. మూడున్నరేండ్ల విచారణ అనంతరం సదరు వ్యక్తి దోషిగా తేలడంతో పోక్సో కోర్టు ఇన్చార్జి జడ్జి రోజా రమణి మంగళవారం శిక్ష విధిస్తూ తుది తీర్పు వెల్లడించారు.
అత్యాచారానికి సంబంధించి 20 సంవత్సరాలు, పోక్సో కేసులో మరో 20 ఏండ్లు, ఎస్సీ, ఎస్టీ కేసులో ఇంకో 10 సంవత్సరాలు అలాగే బెదిరింపులకు సంబంధించిన కేసులో మరొక ఏడాది జైలు శిక్షతో పాటు రూ.85 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. బాధితురాలికి రూ.7 లక్షల నష్ట పరిహారం ప్రకటించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. ఐ.ఓ లుగా జి.వెంకటేశ్వర్ రెడ్డి, మట్టయ్య, కోర్ట్ పి.సి డి.కిరణ్ కుమార్ (3209), ప్రస్తుత ఎస్.హెచ్.ఓ గా ఎన్.శంకర్ కీలకంగా వ్యవహరించారు.