సంస్థాన్ నారాయణపురం, ఫిబ్రవరి 12 : మండలంలోని డాకు తండాకు చెందిన కరంటోతు తులసీరామ్, సాలీ దంపతుల కుమారుడు కరంటోతు రమేశ్ నాయక్ ఇటీవల యూపీఎస్సీ విడుదల చేసిన ఫలితాల్లో భారత రక్షణ రంగం నేవీలో అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న తులసీరామ్ దంపతులకు ముగ్గురు పిల్లలు కాగా రమేశ్‌నాయక్ చిన్నవాడు. పుట్ట్టుకతోనే పోలియో ఉండడంతో ఆత్మైస్థెర్యం కోల్పోకుండా కష్టపడి చదవి కొలువు సాధించాడు.
విద్యార్థులకు ట్యూషన్లు చెబుతూ, ఓలా బైక్ నడుపుతూ వచ్చిన డబ్బుతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యానని రమేశ్ తెలిపాడు. మొదటి ప్రయత్నంలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించిన రమేశ్‌ను తల్లిదండ్రులు, తండా ప్రజలు అభినందిస్తున్నారు. రమేశ్ నాయక్ 5 నుంచి 10వ తరగతి వరకు హయత్ నగర్‌లోని ఎస్సీ హాస్టల్లో చదివాడు. మాహబూబ్నగర్లో మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేసి, ఇబ్రహీంపట్నంలో బీటెక్, ఎంటెక్ చేశాడు. 2023లో యూపీఎస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్లో ఉత్తమ ర్యాంక్ సాధించి, 2024 డిసెంబర్ 3న ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు. ఈ నెల 24వ తేదీన ముంబైలో ఉద్యోగంలో చేరనున్నట్లు రమేశ్ పేర్కొన్నాడు.