నల్లగొండ/చందంపేట(దేవరకొండ), మే 31 : నల్లగొండ జిల్లావ్యాప్తంగా సోమవారం రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం స్థానికంగా ఆయన మాట్లాడుతూ..అలుపెరగని పోరాటంతో, ఉద్యమ రథసారథి కేసీఆర్ సారథ్యంలో సాధించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. నియోజకవర్గ కేంద్రాల్లో, మున్సిపాలిటీలు, పట్టణాలు, మండలాల కేంద్రాల్లో జాతీయ జెండాను, పార్టీ పతాకాన్ని ఎగురవేసి, పెద్దఎత్తున సంబురాలు నిర్వహించాలని ఆయన కోరారు. పార్టీ నాయకులు, శ్రేణులంతా పాల్గొనాలని, ప్రజలతో కలిసి సోమవారం అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించాలన్నారు.
అమరుల త్యాగాలు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థుల పోరాటాలు, సబ్బండ వర్గాల సమిష్టి కృషితోనే ఆరు దశాబ్దాల కల సాకారం అయిందని ఆయన గుర్తు చేశారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ తొలి పదేండ్ల ప్రస్థానం యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని రమావత్ రవీంద్ర కుమార్ తెలిపారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రతి ఆలోచన అనేక రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర సర్కార్కు కూడా దిక్సూచిగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ గడ్డపై పురుడు పోసుకున్న రైతుబంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలు దేశానికే దారిచూపే దీపస్తంభంలా నిలవడం ప్రతి తెలంగాణ బిడ్డకు గర్వకారణమని ఆయన స్పష్టం చేశారు.