నీలగిరి, సెప్టెంబర్ 17: భూమికోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం అనాడు జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తూ, అబద్ధపు ప్రచారం చేస్తున్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చరిత్రను తెలసుకొని అబద్ధపు ప్రచారాన్ని మానుకోవాలని సీపీఎం పొలిట్ బ్యూరో మాజీ సభ్యురాలు బృందా కారత్ హితవు పలికారు. నల్లగొండలో బుధవారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభలో బృందా కరత్ మాట్లాడుతూ దేశ చరిత్రలోనే సెప్టెంబర్ 17 లిఖించదగిన రోజన్నారు.
భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వస్తే, హైదరాబాద్ సంస్థా నం 1948 సెప్టెంబర్ 17న ఇండియన్ యూ నియన్లో విలీనమైందన్నారు. ఒక సంవత్సరం కాలం పాటు జరిగిన పరిణామాలను వక్రీకరించి రకరకాలుగా ప్రచారం చేస్తున్నారన్నారు. మంగళవారం రాత్రి కేంద్ర రక్షణ శాఖ మంత్రి హైదరాబాద్ వచ్చి అబద్ధాలు మాట్లాడారన్నారు.
తెలంగాణ పోరాటం ముస్లిం రాజు, హిందువులకు మధ్య జరిగిన పోరాటమని చిత్రీకరించారన్నారు. మరి జమ్మూ కాశ్మీర్ కూడా ఇండియన్ యూనియన్లో విలీనమైందని మరి అకడి రాజు హరి సింగ్ హిందువు అని, ప్రజలు ముస్లింలని మరి అకడ ఎందుకు ప్రచారం చేయడం లేదని ప్రశ్నించారు. నేడు తెలంగాణకు వచ్చి విమోచన, హిందూ ముస్లింల మధ్య పోరాటమని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు మల్లు లక్ష్మి, చంద్రారెడ్డి , వీరారెడ్డి, ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు