యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ) ;ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ విషయంలో రాష్ట్ర సర్కారు వివక్షను ప్రదర్శిస్తున్నది. ట్రిపుల్ ఆర్‌లో భాగంగా ఉత్తర భాగానికి ఒక విధంగా, దక్షిణ భాగానికి మరోలా వ్యవహరిస్తున్నది. దక్షిణ భాగంలో అడ్డగోలుగా మార్పులు చేస్తున్న ప్రభుత్వం రాయగిరి అలైన్మెంట్ మార్చాలని రైతులు పెద్దఎత్తున ఉద్యమించినా పట్టించుకోలేదు. అసెంబ్లీ ఎన్నికల ముందు, తర్వాత హామీలు ఇచ్చినా బుట్టదాఖలు చేసింది. దాంతో రాయగిరి రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్‌ను ఉత్తర, దక్షిణ భాగాలుగా విభజించారు. ఉత్తర భాగంలో భాగంగా జిల్లా మీదుగా 59.33 కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించనున్నారు. దీని పరిధిలోకి తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్ మండలాలు ఉన్నాయి. 24 గ్రామాల మీదుగా రహదారులు వేయనున్నారు. రాయగిరి, చౌటుప్పల్ వద్ద ఇంటర్ చేంజ్ జంక్షన్లు నిర్మించనున్నారు. మొత్తంగా సుమారు 2వేల ఎకరాల భూమిని సేకరించనున్నారు. భువనగిరి మండల మినహా మిగతా మండలాల్లో అవార్డు తనిఖీ ప్రారంభమైంది. కొన్ని గ్రామాల్లో చేపట్టాల్సి ఉంది. ఇప్పటికే త్రీడీ ప్రకటన రాగా, త్వరలో త్రీజీ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.
ఎన్నికల ముందు కాంగ్రెస్హామీ
అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ట్రిపుల్ ఆర్‌పై కాంగ్రెస్ మొసలి కన్నీరు కార్చింది. బీఆర్ఎస్ను దోషిగా నిలబెట్టేందుకు నానా యాగీ చేసింది. అధికారంలోకి వస్తే ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ మారుస్తామని హామీల మీద హామీలు గుప్పించింది. ఏకంగా భువనగిరిలో పర్యటన సమయంలో ఆ పార్టీ అగ్రనేత ప్రియాంకాగాంధీతో ప్రకటన చేయించారు. అప్పటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆర్ అండ్ బీ శాఖ మంత్రిగా జిల్లాకు తొలిసారి వచ్చిన సందర్భంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అలైన్మెంట్ మారుస్తామని కలెక్టరేట్లోనే ప్రకటించారు. ఆ తర్వాత పట్టించుకోవడం లేదు. పైగా రాయగిరి రైతులకు వ్యతిరేకంగా కోర్టులో కొట్లాడేలా అధికారులను పురమాయించారు.
‘దక్షిణం’లో అడ్డగోలుగా మార్పులు!
వాస్తవానికి ఔటర్ రింగ్ రోడ్డుకు 40 కిలోమీటర్ల బయటకు ట్రిపుల్ ఆర్ నిర్మిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీలోనూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఆ దిశగా పలు చోట్ల మార్పులు చేస్తున్నారు. రాయగిరి మాత్రం 30కిలోమీటర్ల పరిధిలోనే ఉంది. ఓ వైపు రాయగిరి రైతులు తమ అలైన్మెంట్ మార్చాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దక్షిణ భాగంలో మాత్రం అవసరాలకు అనుగుణంగా అడ్డగోలు మార్పులు చేస్తున్నారు. జిల్లాలోని చౌటుప్పల్ వద్ద జంక్షన్ మార్పు చేశారు. నల్లగొండ జిల్లాలో తక్కళ్లపల్లి నుంచి కిష్టరాంపల్లికి జరిపారు. రంగారెడ్డి జిల్లాలో తలకొండపల్లి అలైన్‌మెంట్‌ను చౌలపల్లి నుంచి ఏదురుగూడెం వరకు మార్పు చేశారు.
పరిహారం ఖరారు!
భూసేకరణలో భాగంగా నిర్వాసితులకు పరిహారం ఖరారు చేసినట్లు తెలుస్తున్నది. భువనగిరి మినహా ఇతర మండలాల్లో గ్రామాలు యూనిట్‌గా తీసుకొని ధర నిర్ణయించినట్లు సమాచారం. ఆర్ఎఫ్సీటీ ఎల్ఏ ఆర్ఆర్ యాక్ట్-2013 ప్రకారం సర్కారు నిర్ణయించిన ధరకు మూడు రెట్లు అదనంగా ఇవ్వనున్నట్లు తెలిసింది. ఇందుకు రిజిస్ట్రేషన్ ఐడీ అనుమతి కూడా లభించింది. తుర్కపల్లిలో ఎకరాకు కనీస ధర రూ. 6.88 లక్షల నుంచి రూ. 11లక్షలు, యాదగిరిగుట్ట మండలంలోని మల్లాపూర్, దాతర్‌పల్లిలో ఎకరాకు గరిష్టంగా రూ.19 లక్షల వరకు నిర్ణయించినట్లు సమాచారం.
ఏండ్లుగా రాయగిరి రైతుల రణం..
ట్రిపుల్ ఆర్‌లో రాయగిరి రైతులు భూములు కోల్పోనున్నారు. గతంలోనూ ఈ ప్రాంత రైతులు పలు సందర్భాల్లో తమ భూములను కోల్పోవాల్సి వచ్చింది. యాదగిరిగుట్ట విస్తరణ, హైటెన్షన్ వైర్లు, జాతీయ రహదారి నిర్మాణం సమయంలో భూములను అప్పనంగా అప్పగించాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఇక్కడి నుంచి ట్రిపుల్ ఆర్ రోడ్డు వెళ్తుండడంతో మిగిలిన కొద్దిపాటి భూమిని కూడా సర్కారు గుంజుకునేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ నేపథ్యంలో ఈసారి భూములు ఇచ్చేది లేదని రాయగిరి రైతులు నాలుగేండ్లుగా రణం చేస్తున్నారు. పెద్దఎత్తున ఆందోళన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చేసేది లేక రైతులు హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు.
ప్రాణాలు పోయినా భూములివ్వం
మా ప్రాంతంలో ఇప్పటికే మూడు దఫాలుగా వేర్వేరుగా అవసరాలకు భూములు ఇచ్చాం. ఇప్పుడు మళ్లీ భూములు ఇవ్వమంటుండ్రు. మంచి డిమాండ్ ఉన్న భూములను నామమాత్రపు రేట్లకు ఎలా ఇస్తాం? ఎన్నికల ముందు కాంగ్రెసోళ్లు ఎన్నో ముచ్చట్లు చెప్పిండ్రు. ఇప్పుడు ఒక్కరు కూడా మాట్లాడుతలేరు. దక్షిణ భాగంలో అలైన్మెంట్ మారుస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు మార్చరు? చౌటుప్పల్‌లో కూడా మార్పులు చేశారు. దక్షిణ భాగం వారికి ఓ న్యాయం.. మాకో న్యాయమా? ప్రాణాలు పోయినా భూములు ఇచ్చేది లేదు.
-పాండు, రైతు, రాయగిరి